Saturday, June 23, 2018

!!ప్రార్ధన!!

బ్రతుకు యుద్ధంలో గెలవలేక ఓడిపోతూ
నవ్వులు పెదవిపై అద్దుకుని సర్దుకుపోతూ
రోజూ చీకట్లో కళ్ళు తెరచి వెలుగు చూస్తూ
కలల పడవను ఎక్కి ఊహల్లో పయనిస్తూ  
ఉనికిని వెతుక్కునే ఆరాటంలో కొట్టుకుపోతూ
ఏం సాధించి ఎంత కూడబెట్టుకున్నానో తెలీదు! 

కానీ...ఎప్పటికప్పుడు కలతలని కడిగేస్తూ
కలవరాలని కడతేర్చి బ్రతుక్కి ఊపిరిపోస్తూ 
కొత్త ఆశల్ని మనసులో నింపుకుని సాగుతూ
జీవితపు చివరి మజిలీ వరకూ నిరీక్షిస్తూ 
ఆనందాలు కొన్నైనా నన్ను హత్తుకుంటాయని 
అడక్కనే అన్నీ ఇచ్చే అతీతశక్తిని వేడుకుంటాను!

Monday, June 11, 2018

!!సావాస దోషం!!

నేను చేస్తున్న వ్యాపారం ఏమిటని అడుగకు నేస్తం...
ప్రేమను అమ్మే దుకాణం తెరిచాను ధ్వేషమనే బజారులో  
ప్రేమను పంచినంత కాలం గంటలు క్షణాలుగా గడిచాయి
ప్రేమను ఆశించడం మొదలుపెట్టగానే క్షణమొక యుగమైంది!

జీవితం చాలా చౌకధరనే పలుకుతుంది చూడు నేస్తం...
కానీ జీవించడానికి ఎన్నుకున్న దారులే చాలా ఖరీదైనవి
దారులు ఎప్పుడూ వంకర పోకుండా తిన్నగానే ఉంటాయి
మలుపులు తిరిగి దారి మళ్ళిపోవడమే జీవితం అవుతుంది!   
    
నాకు నీకు ఉన్న సంబంధం ఏమిటని అడుగకు నేస్తం...
ఎన్నో నమ్మకాల పునాదిపై కట్టుకున్న బంధం నాది నీతో
కావలసింది ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాయి  
ఈ బంధం చేతికి పెట్టుకునే గోరింట తలకు పెట్టుకున్నప్పుడైంది!

మలుపు తిరగవలసి సమయంలో తిరక తప్పదు నేస్తం...
దాన్ని దారితప్పడం అనుకోవడం మూర్ఖత్వం అనుకుంటాను
మనసుకి గాయంచేసి మన్నించమనే మందు పూస్తున్నాయి 
నిజాలు చెప్పడం మొదలుపెట్టినాక మౌనమే మాట్లాడుతుంది!