Tuesday, January 15, 2019

అసలైన పండుగ

ఏ పండుగ చూసినా ఏముంది..అంతా ఆర్టిఫిషల్ 
పలుకరింపుగా శుభాకాంక్షలంటూ మెసేజ్ పెట్టడం
ఒక వీడియోను ఫార్వాడ్ చేసి రిలాక్స్ అనుకోవడం     
ఒక సెలవు దొరికిందని ఉద్యోగస్తులు సంతోషపడడం
మనసు ప్రశాంతతను వీడ నిద్రనే మాత్రగా మ్రింగి
కలని ఆనందమని అందరూ అలా ఉండాలని కోరగా
ఉండలేమని అంతరంగం చేసే శబ్దాన్ని నిశ్శబ్దమని 
మనుషులు నవ్వడంరాక  ఏడ్చే ప్రయత్నంలో అలసి
డిగ్నిటీ అనే లేని గంభీరత్వాన్ని అరువు తెచ్చుకుని
అసలు రూపాన్ని మరచి యంత్రంగా మారువేషం దాల్చి 
ఒకర్ని మించి మరొకరు నటనలో అవార్డ్ కొట్టేస్తుంటే..
పండుగలు పబ్బాలతో అవసరం ఏముంది అనిపిస్తుంది
కలిసి మెలిసి కల్మషం లేకుండా కష్టపడి పనిచేసినరోజు 
ఏ దినమైనా..ప్రతి ఇంటా సంక్రాంతి సంబరమౌతుంది! 

Saturday, January 5, 2019

!!ఏమి భాగ్యము!!

జనం అంటుంటారు ఆడవాళ్ళు అదృష్టవంతులని 
నిజమేనేమో...మహిళలు మహాగొప్పజాతకులు!
రాత్రంతా సగం మేల్కొని సగం నిద్రతో గురకతీస్తూ
చీకటి సిరాలో వేళ్ళుంచి పగటిపని జాబితా రాస్తూ
పిల్లల దుప్పటి సర్ది తలుపులు కిటికీలు మూస్తూ
మగని మనసు నొప్పించని చిట్కాలకై వెతికేరు...
రవి ఒళ్ళు విరుచుకోక ముందే నిద్రలో పరిగెడుతూ
గాలికంటే వేగంగా ఇంట్లోనూ బయటా తిరుగుతూ
రోజువారి ఆశల్ని పిండేసి మాసినబట్టల్లా మూలకేసి 
క్యారేజీలోకి కొత్తరుచుల కవితలు కడుతుంటారు...
తమకు తాము దూరమై ఇంట్లో వారందరికీ దగ్గరై
తీరని కలల్ని పూర్తిగా కనక పిల్లల కలల్ని తీర్చేటి
ఇల్లాలైనా ఉద్యోగినైనా నవ్వుని మేకప్ వేసుకుని
మండుటెండలో మంచుపూలజల్లు కోరుకుంటారు...
ఆనందంగా ఉండాలన్న భరోసాతోటి బ్రతికేస్తుంటారు    
ఆహా ఏమి భాగ్యము మగువా నీదెంతటి అదృష్టం!