Saturday, January 5, 2019

!!ఏమి భాగ్యము!!

జనం అంటుంటారు ఆడవాళ్ళు అదృష్టవంతులని 
నిజమేనేమో...మహిళలు మహాగొప్పజాతకులు!
రాత్రంతా సగం మేల్కొని సగం నిద్రతో గురకతీస్తూ
చీకటి సిరాలో వేళ్ళుంచి పగటిపని జాబితా రాస్తూ
పిల్లల దుప్పటి సర్ది తలుపులు కిటికీలు మూస్తూ
మగని మనసు నొప్పించని చిట్కాలకై వెతికేరు...
రవి ఒళ్ళు విరుచుకోక ముందే నిద్రలో పరిగెడుతూ
గాలికంటే వేగంగా ఇంట్లోనూ బయటా తిరుగుతూ
రోజువారి ఆశల్ని పిండేసి మాసినబట్టల్లా మూలకేసి 
క్యారేజీలోకి కొత్తరుచుల కవితలు కడుతుంటారు...
తమకు తాము దూరమై ఇంట్లో వారందరికీ దగ్గరై
తీరని కలల్ని పూర్తిగా కనక పిల్లల కలల్ని తీర్చేటి
ఇల్లాలైనా ఉద్యోగినైనా నవ్వుని మేకప్ వేసుకుని
మండుటెండలో మంచుపూలజల్లు కోరుకుంటారు...
ఆనందంగా ఉండాలన్న భరోసాతోటి బ్రతికేస్తుంటారు    
ఆహా ఏమి భాగ్యము మగువా నీదెంతటి అదృష్టం!

5 comments: