Wednesday, March 9, 2022

!!ఎదుగుతున్నాం!!

తల్లి పాలు తాగి అప్పుడు రొమ్ముపై తన్నాం
ఇప్పుడేమో మనసు విరచి దూరమైపోతున్నాం
అవును మనం బాగా ఎత్తుకు ఎదిగిపోయాం!

అమ్మ కనబడకపోతే అప్పుడు అల్లాడిపోయాం
ఇప్పుడు అమ్మానాన్నలను వదలి వెళుతున్నాం
అవును విదేశాల్లో ఉంటేనే సంస్కారవంతులం!

డిబ్బీలో డబ్బులువేసి అప్పుడు మురిసిపోయాం
ఇప్పుడు డబ్బులకు దాసోహమై బ్రతికేస్తున్నాం
అవును మనమిప్పుడు మాగొప్ప ధనవంతులం!

చెడులో కూడా మంచి చూస్తూ పెరిగిన వాళ్ళం
ఇప్పుడు మంచి చెప్పినా చెడు అనుకుంటున్నాం
అవును ఇప్పుడు మనం ఎంతో జ్ఞానవంతులం!

చుట్టూ చుట్టాలుండాలని అప్పుడు కోరుకున్నాం
ఇప్పుడు చుట్టాలు వస్తారంటేనే బాధపడుతున్నాం
అవును స్వార్థపు ఏడంతస్తుల మేడలో ఉన్నాం!

సంతోషం సగం బలమని పోటీపడుతూ పెరిగాం
ఇప్పుడు సంపాదనే సర్వమని వెంపర్లాడుతున్నాం
అవును మనం ఇప్పుడు స్థితిమంతులమైపోయాం!

ఎదగడానికి తొందరపడి ఎదిగేక సిగ్గుపడుతున్నాం
యంత్రాలమైపోయి మనుషులమని మరచిపోయాం
అవును ఎంతో ఎదిగి ఏంకాకుండానే రాలిపోతాం! 

4 comments:

  1. నీతి నిజాయితి మర్యాద విధేయత నలువైపుల ఉండేదపుడు
    కుళ్ళు ఈర్శ్య అసూయ చిరాకు నడుమ జీవితం అల్లాడే నేడు
    ఔను మార్పు సాధించి ఉన్నటుండీ చితికిల పడిపోతున్నాం!

    ReplyDelete