Friday, August 4, 2023

!!బ్రతుకుభరోసా!!

ఊపిరి ఆగిపోయిన ఊహలకు
గాయపడిన జ్ఞాపకాలు గుర్తులేవు
కానీ..అలజడి చేసే అంతరంగానికి
అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి కదా!

ఉనికి మోసే గుర్తుల సంకెళ్ళకు
సానుభూతి శాలువాలు కప్పక్కర్లేదు
కానీ..సహనానికి సహకారం కావాలి  
అంతులేని కధకి అర్థం చెప్పాలి కదా!

ఉసురేదో తగిలె గాయమైన గుండెకు
భరించలేని బాధతోనైనా బండకాలేదు
కానీ..భవిష్యత్తుని భరోసా కోరుతుంది
బ్రతికి ఉండగానే చావలేదేమో కదా!

Tuesday, May 2, 2023

!!మారాలి!!

నిలకడగా నిలబడి నెమ్మదిగా అన్నీ వినుకో
ఎవరి నిజస్వరూపం ఏమిటో తెలుస్తుంది..

నీ గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకో
తుదివరకూ నీకునువ్వే తోడు ఉండాల్సింది..

అంతా మన మంచికే జరుగుతుంది అనుకో
మంచిచెడుల తేడా మన వైఖరి పైనే ఉంది..

మాట్లాడే ముందు పలుమార్లు ఆలోచించుకో
అన్నది మరువకున్నా క్షమించాల్సి వస్తుంది..

చెప్పే చాడీలు నమ్మక కళ్ళు తెరచి చూసుకో
పనికొచ్చే సమాచారమైతే అది బాగుంటుంది..

Wednesday, April 26, 2023

!!జీవిద్దాం!!

మనిషిలో మంచి కోసం ప్రాకులాడకు
వారిలో వాస్తవాలను వెతుకులాడు!!

మంచి బూటకపు బుర్కా వేసుకున్నా
నిజం నగ్నంగా నెమ్మదిగా నడుస్తూ
గర్వంగా గాయాలతో సాగిపోతుంది!!!

మన జీవితం మనకి నచ్చినట్లు ఉందాం
దొరికింది ఏదైనా ఆనందంగా అనుభవిద్దాం
పొందలేని వాటి గురించి చింతించ వద్దు
చనిపోయే క్షణాలని కూడా జీవించేద్దాం!

Monday, January 23, 2023

 !! సర్దుకునిపో!!

బాధలు ఎన్ని ఉన్నా..
నలుగురిలో నవ్వవలసిందే!

ఎలా ఉన్నావని అడిగితే..
బాగున్నామని చెప్పవలసిందే!

పరిస్థితులు మారిపోతుంటే..
తలవంచి మసలుకోవల్సిందే!

మన కలలు పలుమార్లు చస్తే..
కొత్తవాటికి ఊపిరి పోయాల్సిందే!

మనసులోని భావోద్వేకాలను..
మనలో అణచుకుని మగ్గవల్సిందే!

కారణాలు ఏవి అయితేనేమి..
మౌనంగా మనం ఉండవలసిందే!

ఇష్టం ఉన్నా లేకపోయినా..
కొందరిని మరచి బ్రతకవలసిందే!