తెలియని భయం వెంటాడుతుందని
ప్రతిక్షణం పురుగైయది తొలిచేస్తుందని
అడుగేస్తున్న బొటనవేలుని నరికినట్లు
మువ్వలు సడిచేయకుండా చిదిమినట్లు
జీవితమే జవాబులేని ప్రశ్నగా మారినట్లు
నీవు ఆలోచించావా ఇలా జరుగుతుందని?
ఈ భయానికి కారణం నీకెరుకనా?
నీ వ్యసనాలకి నే బలికావలసిందేనా
మనసుని మార్చి కఠినత్వం నేర్పించి
నీదాన్నైన నన్ను వేరెవరో అనుభవించి
వ్యభిచారిగా మారే పరిస్థితులు కల్పించి
అర్ధంతరంగా ముగిసే బ్రతుకిదని తెలుసునా?
తెలిసిన భయం నిలకడగా ఉండనీయకుంది
వద్దనుకున్న భవిష్యత్తు శూలమై పొడుస్తుంది
తాగుడికి బానిసవి నీవైతే శిక్ష నాకెందుకో చెప్పు
నీవు త్రాగే మద్యంలో కరగాలా నా నుదుటి బొట్టు
తెగింపు తెచ్చిన ధైర్యమో లేక చివరిప్రయత్నమో!!
అందుకున్నా త్రాగుడిని నరికే ఆత్మవిశ్వాసపు కత్తి
తెగనరుకుతా నీలోని వ్యసనాసురుడుని....నేనే ఆశక్తి.