Wednesday, March 27, 2013

నేనే ఆశక్తి

తెలియని భయం వెంటాడుతుందని
ప్రతిక్షణం పురుగైయది తొలిచేస్తుందని
అడుగేస్తున్న బొటనవేలుని నరికినట్లు
మువ్వలు సడిచేయకుండా చిదిమినట్లు
జీవితమే జవాబులేని ప్రశ్నగా మారినట్లు
నీవు ఆలోచించావా ఇలా జరుగుతుందని?

ఈ భయానికి కారణం నీకెరుకనా?
నీ వ్యసనాలకి నే బలికావలసిందేనా
మనసుని మార్చి కఠినత్వం నేర్పించి
నీదాన్నైన నన్ను వేరెవరో అనుభవించి
వ్యభిచారిగా మారే పరిస్థితులు కల్పించి
అర్ధంతరంగా ముగిసే బ్రతుకిదని తెలుసునా?

తెలిసిన భయం నిలకడగా ఉండనీయకుంది
వద్దనుకున్న భవిష్యత్తు శూలమై పొడుస్తుంది
తాగుడికి బానిసవి నీవైతే శిక్ష నాకెందుకో చెప్పు
నీవు త్రాగే మద్యంలో కరగాలా నా నుదుటి బొట్టు
తెగింపు తెచ్చిన ధైర్యమో లేక చివరిప్రయత్నమో!!
అందుకున్నా త్రాగుడిని నరికే ఆత్మవిశ్వాసపు కత్తి
తెగనరుకుతా నీలోని వ్యసనాసురుడుని....నేనే ఆశక్తి.

5 comments:

  1. ఎంత చక్కటి కవితండి. 'ఆ శక్తి' గొప్పగా ఉంది.

    ReplyDelete
  2. అడుగేస్తున్న బొటనవేలుని నరికినట్లు
    వద్దనుకున్న భవిష్యత్తు శూలమై పొడుస్తుంది
    నీవు త్రాగే మద్యంలో కరగాలా నా నుదుటి బొట్టు (fantastic)

    పైన చెప్పిన మూడు వాక్యాలు అద్భుతః !!

    మీ పద్యం లోని ఒక రెండు వాక్యములకి
    భారత స్త్రీ స్వాభిమానం గౌరవిస్తూ నా సొంత భాష్యం సరదాగా ఇలా (క్షమించాలి మీరు) ...

    నీ చెంతనే పరాయి పంచగా అగుపించి,
    వ్యభిచారిణి గా అనిపించే భావాన్ని పెంచి

    ReplyDelete
  3. కొత్త ఒరవడితో ప్రేరణాత్మకంగా ఉందండి.

    ReplyDelete
  4. అద్భుతంగా ఆవిష్కరించారు.

    ReplyDelete
  5. మీరు కవితలు కూడా బాగారాయగలరు.

    ReplyDelete