Monday, September 16, 2013

Thursday, September 12, 2013

!!ఎదగమాకు!!

ఓ! చిట్టితల్లీ త్వరగా ఎదగమాకు
నిన్ను రోజూ లాలించి పాలిస్తాను
పసిదానివైతే పొత్తిళ్ళలో దాస్తాను
బుజ్జగించిమరీ బువ్వతినిపిస్తాను
నీవడక్కుండా అన్నీ అందిస్తాను
కాని పెరిగిపెద్దై అందకుండాపోకు!

ఓ! కన్నా నీవో అమాయకురాలివి
విరిసీవిరియని ముద్దమందారానివి
నవ్వినవారిని నావారనుకునేదానివి
మోములో మదిని చదవలేనిదానివి
ఈ లోకం కుతంత్ర మాయాజాలవలకి
చిక్కక జారిపోవాలంటే ఎదిగిపోమాకు!

ఓ! బంగారుకొండా తళుకులతో మెరవకు
విద్యతో నీవే చెక్కుకో జ్ఞానపు నగిషీలను
త్రుంచేయి ఊగిసలాడే ఊహల మేడలను
నిబ్బరంతో నిర్మించు నిశ్చల గృహమును
ఎంతెదిగినా నాకు పసిదానివేనని మరువకు
ఎదగొద్దన్నానని ఎత్తుకెదిగి నీవు అలగమాకు!

Wednesday, September 4, 2013

!!భయం!!

కొందరు పగటి వెలుగులో తమనితాము చూసి భయపడితే
మరికొందరు చీకటిలో తమ నీడచూసి తామే భయపడతారు
నా ప్రత్యేకతని నిరూపించుకునే నెపముతో నిబ్బరంగా నిలచి
ప్రేమాభ్యర్ధనకి నేనే కరిగి తప్పు చేస్తానని భయపడుతున్నాను!

కొందరికి కలలు కంటూ హాయిగా బ్రతికేయడం అలవాటైతే
మరికొందరికి మత్తులో సర్వం మరచి జీవించడం అలవాటు
నాకునేనై అలవరుచుకోలేని అలవాట్లతో అతిగా కలవరపడి
శుభం పలకాలన్నా శృతితప్పి వణికే పెదవులతో భీతిల్లాను!

కొందరికి తలచినదే తడువు శ్రమపడకనే కోరినవి దక్కితే
మరికొందరికి శ్రమించినా ప్రతిఫలం దక్కదని తెలిసికూడా
నా అనుభవపు దొంతరలోదాగిన చిరుచేదు నిజాల నీడలో
వీడనిబంధాన్ని భూతద్దంలో విడిగాచూసి భూతమంటున్నాను!

Sunday, September 1, 2013

!!తెలిసింది!!

అలనాడు అంటే విన్నాను
రాతిలోన దేవుడు ఉన్నాడని
నేడు కనులారా చూస్తున్నా
మనుషులే రాళ్ళై పోవడాన్ని!

తెలిసి గుడిలోకి ఏం వెళ్ళను
జనమే రాళ్ళుగా మారిపోతుంటే
మ్రొక్కుబడులు ఎన్నని తీర్చను
ఆశలెన్నో అంతులేని పుట్టలైనాక!
మంచే మన ఆభరణం అనుకుంటే
తెలిసె మిద్దెమేడలే కొలమానమని
అనురాగంగా అంతా నావారనుకుంటే
బంధాలు అవసరావకాశ తులాభారాలని
బంధుత్వాలు స్వార్ధపు సాలెగూళ్ళని తెలిసె!