Wednesday, December 25, 2013

!!తరాంతరాలు!!

వేరుదారుల్లో ఇద్దరిదొకటే గమ్యం...

నావేమో అనుభవసారాలు

నీవేమో నిండైన ఆలోచనలు

నావేమో గతించిన జ్ఞాపకాలు

నీవేమో చిగురిస్తున్న ఆశలు

నేను వేస్తున్నది పునాదిరాళ్ళు

నీవు వింటున్నవి మది అలజళ్ళు

నాదేమో నిలకడ నిశ్చల నిర్ణయం

నీదేమో వయసు నేర్పిన నిర్భయం

నాదైన అమ్మ ప్రేమలో "నిస్వార్థం"

నీదైన నిండు ప్రేమలో "నీ స్వార్థం"

ఇదేనేమో తరాంతరాల పరమార్థం!

Saturday, December 21, 2013

!!ముసుగు!!

మనసుకేసిన ముసుగు తీసి మాట్లాడు
మమతలు అద్ది మనసువిప్పి మాట్లాడు

మాటలతో మభ్యపెట్టి మతలబు అడగకు
మనవారైతే మొహమాటానికి తావీయకు

మనసుకో స్నేహ ముసుగేసి చర్చించకు
కోరికకు కొత్తరంగులద్ది ప్రేమని మురవకు

ముసుగులో గుద్దులాటని గెలుపనుకోకు
మరోముసుగుతో ముంచి మంచనుకోకు

మనసు ముఖంపై ముసుగు తీసి చూడు
మంచిబాటలో మరోమెట్టు ఎదిగావుచూడు

Monday, December 16, 2013

!!నా అస్తిత్వాక్షరాలు!!

వ్రాయాలనుకుంటాను అందమైన రీతిలో
భావాలకి భాష, అక్షరాలు నేర్పాలని కాదు
ఆత్మతృప్తినిచ్చే అక్షరాలకి రూపమివ్వాలని

వ్రాయాలనుకుంటాను అద్భుతమైన శైలిలో
భాషపై అత్యంత పటుత్వము ఉన్నదని కాదు
భావవ్యక్తీకరణపై అక్షరాలకి వల్లమాలిన ప్రేమని

వ్రాయాలనుకుంటాను ఆలోచనలన్నీ కవితలో
భావుకతలకి కల్పనలు అద్దే కవయిత్రినని కాదు
పక్వపరిణితి చెందేలా మనసుకి పదును పెట్టాలని

వ్రాయాలనుకుంటాను ఆవేదనవంపి అక్షరమూసలో
భాంధవ్య బంధాలు భాధ్యతలు భాధించాయని కాదు
మదిని, మెదడుని ఒకేతాటిపై నడిపించేలా చేయాలని

వ్రాయాలనుకుంటాను అమూల్యాక్షరాలని పదమాలలో
భవసాగరంలో ఎదురీది గెలుపొందాలన్న స్వార్థం కాదు
నా అస్తిత్వానికి పునాదిగా అక్షరాలని అమర్చుకోవాలని