Monday, February 3, 2014

వృధాప్రయత్నం

పలకా బలపం పట్టి పదాలెన్నో కూర్చి
పలకలేని భావాలన్నీ అందులో పేర్చి
చదవమంటే సరిగ్గా కనబడడం లేదని
నల్లకళ్ళద్దాలు తొడిగి రంగుకల చూస్తే
కనబడేది నలుపే కాని తెలుపు కాదు..

మూర్ఖుడికి మంచి ముచ్చట్లెన్నో చెప్పి
మురిపాలతో అనురాగ పాఠాలు నేర్పి
గాజువంటి జీవితాన్ని గోముగిస్తే కాదని
విసిరేసి ముక్కలు చేసి గాయాలు చేస్తే
మందువేసినా గాటుమాత్రం మాసిపోదు..

బండబారిన మనసుని బరిలోకి దింపి
ప్రేమనంతా పోసి గోరుముద్దలుగా చేసి
తినిపించబోతే చేదు నోటికి సహించదని
తియ్యతేనెలో విషాన్ని రంగరించి సేవిస్తే
విషం వెన్నగామారి ప్రాణం పోసేయదు..

6 comments:

  1. బండబారిన మనసును కరిగించడానికి ఒక జీవిత కాలం చాలదేమో రాణిగారు.

    ReplyDelete
  2. ఎంత భావం ఉందో, అంత వేదన ఉంది,
    కాలమే పరిష్కారం చెప్పాలి. కవిత చాలా బాగుంది మేడం

    ReplyDelete

  3. "నల్లకళ్ళద్దాలు తొడిగి రంగుకల చూస్తే
    కనబడేది నలుపే కాని తెలుపు కాదు.."

    అని మీరన్నా... మీ రచనల్లో కనిపించేదంతా 'శ్వేత వర్ణమే' కదండీ . Excellent కవిత.
    పద్మా రాణి గారూ !!
    మీరేమీ అనుకోనంటే ఓ మాట . ఎలా వస్తాయి ఇంత విభిన్నతతో కూడిన ఆలోచనలు మీకు. కవిత కవితకూ భిన్న రూపాలు. ఏకలవ్య శిష్యరికం పొందాలనే నా ఆశకు.. (బొటనవ్రేలు అడక్కుండా).. ఓ మారు "అహొ శిష్యా " అని అనరూ.
    - శ్రీపాద

    ReplyDelete
  4. ఎంతో నచ్చింది మీ కవిత

    ReplyDelete
  5. మాడం మీరు ఏదైనా హృదయానికి హత్తుకునేలా చెబుతారు చదివేకొద్ది చదవాలి అనిపిస్తుంది.

    ReplyDelete