Sunday, August 24, 2014

!!అందీఅందక!!

నింగిలోని జాబిలివై నాకు అందకుండా నీవుంటే
నీ రూపాన్ని గుండెల్లో దాచుకుని ఆనందిస్తున్నా.

అక్కడెక్కడో ఒయాసిస్సులా కనీకనబడక నీవుంటే
గుండెనిండా ఆశలను నింపుకుని నేను బ్రతికేస్తున్నా.

మదినిండా ప్రేమతో కురియని మేఘంలా నీవుంటే
నీ జ్ఞాపకాల సెగలతో ఆవిరైన ఆశలతో ఎదురుచూస్తున్నా.

సంతోషాల సెలఏరులా నీవు పొంగి ప్రవహిస్తుంటే
నిలువని నా ప్రేమతో ఆనకట్ట వేసి ఆపాలనుకుంటున్నా.

ప్రతిక్షణం నీవు లేవన్న లోటు నన్ను ఏడిపిస్తుంటే
మరచిపోవాలనుకుంటూనే మరల మరల నీ పేరే జపిస్తున్నా.

Wednesday, August 13, 2014

నా ప్రేమ

ప్రేమని వ్యాపారంగా చూసి

లాభనష్టాలంటూ బేరీజు వేసి

మనసిచ్చిపుచ్చుకునే సంతలో

అమ్ముడుపోయే వాళ్ళు కోకొల్లలు

పో....పోయి అక్కడ కొనుక్కో ప్రేమని

నా ప్రేమని కొనే కాసులు కాదు కదా

ఖరీదు కట్టే కలేజా కూడా నీకు లేదు!

నా ప్రేమ రుసుముకి కాదు దక్కేది....

                                         నేను రుణమున్న వారికే అది చిక్కేది!!

Tuesday, August 5, 2014

తీరని ఋణం

మెల్లగసాగు జీవితమా ఋణాలు ఇంకా బాకీఉన్నాయి
అసలుకంటే ముందు వడ్డీ ఇమ్మని అడుగుతున్నాయి
హడావిడిగా సాగి కొన్ని తీరి మరిన్ని మిగిలి ఉన్నాయి

నెమ్మదిగానడు జీవితమా భాధ్యతలింకా మిగిలున్నాయి
భాధలే దించి బరువు తగ్గించమంటూ బంధాలు కోరాయి
అలుకలే తీర్చి ఏడ్చేవారిని నవ్వించమని అంటున్నాయి

కుదురుగా పయనించు జీవితమా పనులింకా ఉన్నాయి
తీరని కోరికలు ఇంకా బాకాయీలంటూ గోలచేస్తున్నాయి
విరిగి అతికిన మమతలు గాయం పూడ్చమంటున్నాయి

నడుస్తూ వెళ్ళు జీవితమా నీవెనుకే నా అడుగులుంటాయి
నా ఊపిరిపై హక్కు ఉన్నవారితో ఊసులాడాల్సి ఉన్నాయి
మెల్లగా సాగిపోవే జీవితమా ఆశలు ఇంకా మిగిలున్నాయి