Saturday, July 25, 2015

మనోభావన


ఈ ప్రేమ అందనంత ఎత్తులోనే ఎప్పుడూ 
ఊగుతూండే వలపు నావ అప్పుడప్పుడూ 

మనసుతో ఆడుకుని మురిసేరు కొందరు 
ప్రేమలో పందెం వేసి గెలిచేరు ఇంకొందరు 

అడుగడుగునా విజయం వరించిన నవ్వు 
దశలుదశలుగా ఓడిపోతే వగచేవు నువ్వు 

తలచినది జరుగక మొదలయ్యేను పతనం 
దక్కని వాటిపైనే ఎందుకనో మోజు అధికం 

వలపు ఎరవేసిన గాలానికి చిక్కినదే వేదన 
మరణం రాక జీవించనూ లేక ఈ సంఘర్షణ

Wednesday, July 15, 2015

!!కలలు!!

కన్నుమూస్తే కళ్ళని దానమివ్వమన్నాను
కానీ బ్రతికుండగానే జీవితం అడుగుతుంది
నా కనులను కాదు నేను కన్న కలలను!!!

కలలను ఎన్నడూ కిరాయికి ఇవ్వొద్దంటాను
మనం కట్టుకున్న సౌధాన్ని కిరాయిదారుడు
అపురూపంగా చూసుకోలేడని తెలిసును!!!

సాగుతున్న సంతలో కలలనే వేలం వేసాను
కావలసినవి కమ్మని కలలై కౌగిలించుకుంటే
నిద్రలో మేల్కొన్న అదృష్టాన్ని చూసి నవ్వాను!!!

Wednesday, July 8, 2015

!!ఎంత బాగుండు!!

కష్టాలని ఇష్టాలుగా మార్చే ఋతువుంటే బాగుండు!

సుఖదుఃఖాలని సమంగా భరించే మనసు ఒక త్రాసై

అనుభవాలు గుణపాఠాలు అయితే ఇంకా బాగుండు!

కొత్తవేదనలు పుట్టుకొచ్చి పాతవ్యధలను మాపే మందై

ఏం గుర్తుకురాని మతిమరుపు రోగం వస్తే బాగుండు!

నిందలు ఎన్ని వేసినా నిష్టూరాలాడని నిబ్బర నిధినై

వెలుగు నీడల్లో ఒకేలా వెలిగిపోతే ఇంకెంతో బాగుండు!