Friday, October 30, 2015

Tuesday, October 13, 2015

!!తలపు!!

కొన్నిమాటలు తలపుకు వచ్చినప్పుడు
కన్నీటిచుక్కలు చెంపల్ని తడుముతూ
ఎవరో గుండెచలమల పై అడుగేసినట్లు
నిశ్శబ్ధంగా పిలుస్తున్నట్లు అనిపిస్తుంది!

అద్దంలో నన్నునేను చూసుకున్నప్పుడు
రెండు పరావర్తన ప్రతిబింబాలు నవ్వుతూ
గడిచిన కాలమే గెంతులేస్తూ వచ్చినట్లు
మనసువిప్పి మాట్లాడినట్లు మరపిస్తుంది!


ఆలోచనల్లో అక్షరాలను వెతుకున్నప్పుడు
గుర్తులే గోళ్ళ చివర మొలచి మొరపెడుతూ
మూసిన కవనంలో తెరచిన జ్ఞాపకాలున్నట్లు
పట్టుకోబోతే దక్కిన ఆనందమే పారిపోతుంది!

Tuesday, October 6, 2015

Saturday, October 3, 2015

!!చెట్టేడ్చింది!!

చేతిలో గొడ్డలిని చూడగానే గుండె గొల్లుమంది 
నన్ను చూసి నా ప్రక్కనున్న చెట్టూ ఏడ్చింది 
చెట్లు లేక నరులకు నీడ, పక్షికి గూడూ ఏదని 
కరెంటు తీగపై కాకి అరిస్తే ప్రతీరెమ్మా ఏడ్చింది 
నేలకై నన్ను నరికితే మూర్ఖత్వం మూర్చిల్లింది! 
గాలిలేక అల్లాడే ప్రాణులని తలచి నింగీఏడ్చింది 
చెట్లులేని నేల సాంద్రత తగ్గిన విషపు మన్నంది 
ఆ మాట విని, ఎత్తెదిగిన వనమే కుప్ప కూలింది 
గలగలా పర్వతం నుండి పారి వచ్చిన జలపాతం 
నేను లేని చోట ఉండనని పారిపోతే ఏడ్పాగనంది! 
మనిషి మనుగడకై ప్రకృతి ప్రసాదించిన వృక్షాలని 
నరికి ప్లాట్లు ఫాట్లని పాడెలే కట్టబోతే ఊపిరాగింది!

Thursday, October 1, 2015

స్వయంకృషి

కంటి కొసల్లో కోపం నిప్పుకణికై రాజుకుని

అందులో స్వప్నాలే కాలి బూడిదైపోయి

అగ్ని గుండెల్లో మండి మదినే దహిస్తూ

స్వరపేటికే పూడుకునిపోయి అరుస్తుంటే

అర్థమైంది...సర్దుబాటే సరైన పరిష్కారమని

అనుకున్నవి అన్నీ జరిగితే చిద్విలాసమని

కొన్నైనా నెరవేరితే అది మన స్వయంకృషని!!