Monday, December 21, 2015

!!పిడికెడు ప్రపంచం!!

పుస్తకాలు చదివి పుణికిపుచ్చుకున్న జ్ఞానం

దోచుకుని పోయింది కంప్యూటర్ పరిజ్ఞానం

సమయాన్ని  సహనాన్ని తీసుకుని...

మతిమరుపునిచ్చె మనకది బహుమానం!

ఆప్యాయ ఆలింగనలకు సెల్ ఫోన్లే అనుసంధానం

కలిసి ముచ్చటించుకోవడం ఇప్పుడొక పెద్దసంబరం

మొబైల్ ముచ్చట్లతో ముడిపడింది ప్రతీ బంధం..

అరచేతిలో బంతిలా మారిపోయె ప్రపంచం!

Friday, December 18, 2015

!!మార్పు!!

సామాజిక స్ఫూర్తని ఆలోచించి ఎవరికేం చెప్పేది
అక్షరాలనే అస్త్రాలుగా సంధించి ఏం నేర్పించేది!?

అన్నీ అలాగే ఉన్నాయి...మనం ఏం మారలేదు
మరి లోకాన్ని మార్చాలని ఎవరికి కంకణం కట్టేది!?

ఇంటి నిండా చెత్త...మనసంతా కుట్రా నింపుకుని
జనోధ్ధారణ అంటూ ధీనంగా ఎవరిపైన అరిచేది..
ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాలు ఎవరికి ఉపదేశించేది!?

ముందస్తుగా ఎవరికి వారే మారి ఏకమై సాగితే...
జగతి మారి, జేజేలు కొడుతూ ఆహ్వానిస్తుంది!!

Monday, December 7, 2015

సంసార సారం

మూడుముళ్ళతో ముడిపడిన 
మా బంధానికి...ముప్పైయ్యేళ్ళు!
సమస్యల్లో సరదాలను వెతికి,
భాధ్యతల్ని బలమైన బంధంగా మలచి
కష్టాలనే ఇష్టాలుగా మార్చి సాగించిన 
ఈ సాహాసోపేత సంసార సారంలో...
తలచుకుంటే అన్నీ మధురస్మృతులే, 
కాదనుకున్నా కాలమేం తిరిగిరాదులే
అందుకే ఏది ఏమైనా ఖుషీఖుషీగా 
హ్యాపీ హ్యాపీస్ అంటూ నవ్వేసెయ్!

Wednesday, December 2, 2015

!!కాలచిత్రం!!

దొర్లుకుంటూ పోతూనే ఉంది కాలం
దారిపొడవునా నేను వెతుకుతున్నా
గడిచిన కాలపు గుర్తులున్నాయని..
కనీసం జ్ఞాపకాల పాదముద్రల్లో
కొన్నైనా మిగిలుండక పోవునాయని..
ఏది ఎక్కడా కనపడనిదే!
అయినా వెళుతూ వెతుకుతూనే ఉన్నా..
ఒడిదుడుకుల రహదారుల్లో కనబడేనని
అరచేతిని ఆటుపోట్లకు అడ్డుగా పెట్టి
ఇసుకలో అద్దాల సౌధానికి పునాది తీసి
అందంగా అల్లిన జీవితపు చిత్రాన్ని గీసి
గోడకి ఆ చిత్రాన్ని తగిలించి..
అందులో మధురమైన జ్ఞాపకాల్ని చూస్తూ!