Monday, May 16, 2016

!!నవ్వేసేయ్!!



నవ్వుతూ నాలుగు ముక్కలు చెప్పేసేయ్
కొన్ని మాటలు నిన్నుకాదనుకుని నవ్వేసేయ్
అన్నిటికీ అనుకుని ఆలోచిస్తే సమస్యలే చుట్టూ
లాక్కుని పీక్కుంటే బుర్రలో గుజ్జుకే చెదలు పట్టు..

కొన్ని నిర్ణయాలు నీవికావని కాలానికి వదిలేసేయ్
రేపెలా ఉంటుందో ఏమో అనుకుని నేడు నవ్వేసేయ్
అప్పుడప్పుడూ సరదాగా సర్దుకుని పోతుండూ
ఎందుకంటే కాయలున్న చెట్టే ఒదిగిపోయి ఉండు..

నీకు నచ్చనివి జరిగినా బయటపడక దాచేసేయ్
కొన్ని నీవికావనుకుని బాధించినా అలగక నవ్వేసేయ్
తప్పులనుకుంటే అన్నీ గుండెను కోసి గాయం చేస్తాయి
అనిశ్చల జీవితానికవి అనవసరం అనుకుంటే హాయి..

Saturday, May 14, 2016

!!సహజంగా!!

సముద్రమే సహజసిద్ధంగా సారాయి అయితే ఎంత బాగో..
కలలు అన్నీ నిజాలు అయితే అబ్బో ఎంత ఖుషీ ఖుషీనో!

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరంలే..
అందరి గుండెలు పారదర్శకమై అగుపిస్తే అబ్బో ఆహా ఓహో!

మౌనానికే మాటరాక మనుషుల మధ్య సంధి అయినదేమో..
ముఖం ముందే ఉన్నది ఉన్నట్లు చెబితే ఎంత రచ్చ రచ్చనో!

ఎప్పుడూ మంచి చేసి చెడు అనిపించుకుంటాను ఎందుకో..
అదేదో సహజంగానే చెడ్డదాన్ని అయ్యుంటే ఎంత బాగుండేదో!

కాలం కలసి వస్తే చేసేది వక్రమైనా అందరికీ వింత విచిత్రమే..
పగబడితే ఆకు కూడా ఆయుధమై ఆయువే తీసేను తెలుసుకో!

Friday, May 6, 2016

!!నా నవ్వు!!

కొన్నిసార్లు నవ్వాలనుకుంటూనే కన్నీళ్ళు కారుస్తుంటాను
కొన్ని నీటిచుక్కలు కంట్లోమొలకెత్తి నన్ను వెక్కిరిస్తున్నట్లు
మరికొన్ని వద్దన్నా గుండెచలమల్లో చేరి నివాసముంటాయి!

కొన్నిసార్లు కన్నీళ్ళే నాకు కడుప్రియమైన భావాలనుకుంటాను
దరిచేరిన వాటిని ఆలింగనం చేసుకోవాలని ఆహ్వానించబోతూనే
మనసుగది గోడకి ధుఃఖపుధూళి మరింతగా వచ్చి అంటుతాయి!

కొన్నిసార్లు ఆలోచన్లు అనిశ్చితాలని సర్దుకోబోయి సంధి అంటాను
అదే అలుసై గాయాలన్నీ ఘనీభవించి సూదుల్లా పొడిచి దొలుస్తూ
రాత్రంతా జాగారముంచి పగలు ముఖంపై నల్లచారికలై నర్తిస్తాయి!

కొన్నిసార్లు అక్షరాలుగా మార్చి గుర్తులకి ఒకరూపు ఇవ్వబోతాను
బరువెక్కిన మనసు కవనమై తెరచిన జ్ఞాపకాలుగా పొంగిపొర్లుతూ 
నుదుటిపై ముడతలై నాట్యం చేయబోయి నివాసమౌతానంటాయి!

కొన్నిసార్లు కన్నీళ్ళు ఏమైనా కొత్తచుట్టాలాని తనివితీరా ఏడుస్తాను
అప్పుడు నాలో అంతర్లీనంగా దాగిన నా ఆత్మవిశ్వాసం నవ్వుతూ
వెర్రిదాన్నంటూ...నన్ను కాదని నా పెదవుల్ని తాకి విప్పారుస్తాయి!