Thursday, May 31, 2018

!!అస్తమించిన ఆశ!!

నన్ను నేను రాటుదేల్చుకుంటున్న కొద్దీ..
చావని ఆశలు రాచరికపు మర్యాదలు కోరుతూ
మదిని వేదనా రుసుము కట్టమని వేధిస్తున్నవి!

సున్నితత్వం బిడియపడలేనంటున్న కొద్దీ..
బింకం బిగుసుకుని బానిసత్వాన్ని పిలుస్తూ 
భస్తాల కొద్దీ దుఃఖాన్ని భుజాలపై మోయమని   
తనకేమీ వద్దంటూ భారీమూల్యం అడుగుతుంది!

ఆత్మాభిమానాన్ని కుదవుపెడుతున్న కొద్దీ..
నా అనిశ్చల అస్తిత్వం నన్ను అలుసు చేస్తూ
ఎదను కోసిన వారి పంచన చేరి ప్రశంసించమని
ప్రాధేయపడి జీవితాన్ని పణంగా పెట్టి పరిగెడుతూ 
జీవనగడియారపు ముల్లు ఆగేదాకా తిప్పుతుంది!

Saturday, May 12, 2018

!!వెన్నుపోటు!!

కొన్నాళ్ళుగా వెనుక వీపులో నొప్పిగా ఉంటుందని  
డాక్టర్ దగ్గరకెళితే వెన్నెముకల్లో ఎడమెక్కువైంది..
ఇకపై వంగి ఉండమాకు అంటూ సలహా ఇచ్చారు
మొదటిసారిగా ఒకరి నోటివెంట ఆ మాట వినగానే
తెలియకుండానే నవ్వూ ఏడుపూ కలిపి వచ్చాయి!

కలవరంతో కళ్ళు కలత ఆలోచనలని ప్రశ్నించాయి!   
చిన్నప్పటి నుండీ అమ్మా నాన్నా పెద్దలూ వృద్ధులూ 
సమాజం సైతం ఆడదానివి నువ్వు..వంగి ఉండమని
స్త్రీ..ఎంత వంగుంటే ఆ గృహమంత సవ్యంగా సాగేనంటే 
అలా వంగిపోయిన నాలోనూ వెన్నుపూస ఉందాని!?
ఇలా వంగి ఉన్నందుకే వెన్నుపోటూ, ఆ శూన్యతాని!      

ఇప్పుడు వంగొద్దంటే నన్నునేను ప్రశ్నించుకుంటున్నాను
బాల్యం నుంచీ అయిష్టాల్ని ఇష్టాలుగా మార్చుకున్నానని 
ఇప్పటికే ఎన్నో కోరికలు కలలూ జారిపోయాయి కదాని
జీవితం నన్ను ఇంకేం నిలబెట్టాలిలే అని సమాధానపడి
సర్దుకునిపోయి సాగవల్సిందే జీవితమని నవ్వుతున్నాను!

Wednesday, May 2, 2018

!!మార్పు!!

ఎవరో అన్నారు... 
రాణిలా బ్రతికిన నాలో రాజసం కరువాయెనని
నేను అన్నాను...
రాటుదేలింది నేనే కానీ రాతిగుండె నాది కాదని 
కొందరు అనుకుంటారు... 
నాలో మునపటి ఆ నవ్వూ కళాకాంతి తరిగెనని
నేను అనుకుంటున్నాను...
వయసుతో పాటు కళ తగ్గినా కరుణ తగ్గలేదని
ఓదార్పుకు మాటలెన్నో చెబుతారు...
సుఖదుఃఖాల్లో చివరి వరకూ తోడు ఉంటామని
నా అనుభవం చెబుతుంది...
ఎవరైనా సరే వారి అవసరం తీరే వరకే ఉంటారని
అందరికీ తెలుసు ఇది...
ఏం జరిగినా జరగక పోయినా జీవితం ఆగేది కాదని!  

Tuesday, May 1, 2018

!!విషెస్!!


కలతలను పెంచే కన్నీరు కూడా నిన్ను చూసి ధైర్యంతో నవ్వాలి!

అలజడులను రేపే ఆలోచనలన్నీ నిన్ను గమ్యానికి తీసుకువెళ్ళాలి!

అడుగు వేయక ఆపే అవరోధాలు ఆత్మవిశ్వాస సోపానాలు కావాలి!

తలచిన ప్రతీ కార్యంలో పట్టుదల నీతో ఉండి విజయభేరి మ్రోగించాలి!

ఆనందం ఉత్సాహం నిన్ను వీడక మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి!