Monday, June 23, 2014

!!భావోధ్వేగాలు!!

భావోధ్వేగాలు సంతలో సరుకులు ఏం కావు
బేరం చేసి లాభనష్టాలు బేరీజు వేయడానికి!!

భావాలేం విరబూయని మల్లెమొగ్గలు కావు
పరిమళమందించి వడలిపోయి రాలడానికి!!

భాధ్యతలు కొనుక్కునే ఆటబొమ్మలు కావు
ఆనందం కోసం ఆడుకుని విసిరివేయడానికి!!

భారంగా చేసిబాసలు ఎన్నడూ సఫలం కావు
అవసరంతీరాక ఎగవేసి చల్లగా జారుకోడానికి!!

భాంధవ్యాలేం వీధిలో అంగడి బొమ్మలు కావు
కొని కోరుకుంటే కొత్తరుచులు అందివ్వడానికి!!

Monday, June 16, 2014

!!నవ్వుతో!!

నీ మౌనానికి అలవాటైన నా మనసు చెవిటిదైతే
లోపం శరీరానిదేనని త్రోసిపుచ్చి సరిపుచ్చుకున్నా

మనసుకి గాయమై కన్నీటి మున్నీరుపాయై పారితే
కంటిలో నలకపడెనని నలుగురితోనని ఏమార్చుకున్నా

చెలిమిలోన లోపముండి చెంతకొచ్చి చేయిజారిపోతే
చెలిమి చేయడం నాకు చేతకాలేదని నిందించుకున్నా

తీర్పు చెప్పే కాలమే కఠినమై వేదనతో చేయికలిపితే
తీరు తెలియని తింగరి నేనని సమాధాన పరచుకున్నా

జీవితసారాంశమే ఇదని సముదాయించి సాగిపోమంటే
జీర్ణంకాలేని ఆవేదనని అణగార్చుకుంటూ నవ్వేస్తున్నా

Sunday, June 1, 2014

!!ఊరట!!

ఉత్తుత్తి మాటలతో ఊరడించి
ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపి
ఉన్నంతలోనే ఏదో ఊరటపడి
ఉప్పెనై పొంగనేల ఎదలోయల్లో!!

ఉన్నదున్నట్లుగా విని ఊకొట్టి
ఉబుసుపోక ఊసులాడ్డం మాని
ఉప్పెనేదైనా ఎదురీది నిలవాలని
ఉబలాటపడే పంతముంది నాలో!!

ఉనికినేమార్చి స్మృతులకి ఉరివేసి
ఉత్సాహమే నన్ను ఊరట కోరేలా
ఉన్నత లక్ష్యాలనే ఊపిరి చేసుకుని
ఉదరకోతైనా హుందాగా బ్రతుకుతా!!