Thursday, February 19, 2015

!!తీరని రుణం!!

బ్రతుకు ఖాతాలో అసలు జమా కాలేదు
ఊపిరి రుణంగా మారి ఇంకా మిగిలుంది!

చెల్లించిన జీవితం వడ్డీలా కాలంలో కలిస్తే
అసలు ఆశగా మారి పెరిగిపోతూనే ఉంది!

తీరాలన్న కోరిక రెక్కలు లేకనే ఎగరబోవ
ఆనందం ఎండినాకులా మారి నేలరాలింది!

నిజం కాని కల మరో కొత్త ఆశతో చిగురిస్తే
విచారమేదో సుడిగాలిలా మారి చుట్టేసింది!

అంచనాలే గజ్జకట్టి అంబరాన్న చిందేయబోవ
నకిలీనవ్వు సంరక్షణగా మారి తైతక్కలాడింది!

Tuesday, February 10, 2015

వెళుతూ...

నన్ను కాదని వెళ్ళిపోతూ...
పెదవిపై నవ్వు చెరగనీకు అన్నాడు!
అతని ఆనందాన్ని కాదనే హక్కు నాకేదని.
నవ్వుతూ అనుకున్నాను...
నేను పోగొట్టుకున్నది నాది కాదని!
అతడు కాదన్నది కేవలం తన సొంతమేనని.
బంధం బిగుతు సడలిపోయిందని...
అపార్థాల్లో పుట్టి, ప్రశ్నా జవాబు తానైనాడని
నేనడిగాను క్షణాల్లో ఊపిరెలా ఆగేనని?
నడుస్తూ పట్టుకున్న చేతిని కాదని వదిలేసాడు!

Saturday, February 7, 2015

!!చౌక బేరం!!

ఈ అనంతకాల గమనంలో...
నా రవ్వంత జీవిత పయనంలో
ఎన్నెన్నో తెలియని మలుపులతో
సుధీర్ఘ ప్రయాణమెన్నో కష్టాలతో..సాగి
నల్లని శిరోజాలు తెలుపుగా మారెనే..కానీ
లోకంతీరు మాత్రం తెల్లబడలేదు ఎందుకనో!
నమ్మకం కానక నీరసించి వీధిలో వెతకలేక
గమ్యం ఏగూటికి ఏగెనని ఎవరినీ అడగలేక
బజారులో నమ్మకత్వం ఖరీదు ఎంతని అడిగితే
అందరూ నవ్వుతూ ఒకే సమాధానం చెప్పారెందుకో!
"నమ్మకమే నగ్నంగా నడిబజారులో నిలబడితే చూడలేక
మానవత్వం ఎప్పుడో కారుచవకగా అమ్ముడైపోయిందని"

Sunday, February 1, 2015

!!మరో ప్రయత్నం!!

నిగ్రహమంటూ గోడపై నిటారుగా నిలబడి

దురాశతో యుద్ధమే చేసి ఓడిపోతే తెలిసే...

నేను మాత్రమే మారి ప్రయోజనం ఏమని

అన్నీ తెలిసినా ఏమీ తెలియని అజ్ఞానినని

పలుకులే పొదుపుగా వాడి పొగరుబోతునై

కలలనే కని కునుకుతో కయ్యాలాడి గెలిచి

నిదురనే రాక నిస్తేజంతో నిశీధిలో నిలబడి

ప్రయత్నమే చేసి పైకి ఎగరలేక పడిపోయి

గాయాలనే కప్పేసి గాట్లకే కుట్లు వేసుకుని

మరోసారి నిలబడ ప్రయత్నిస్తే తప్పులేదని!!