Tuesday, January 31, 2017

!!ఫోటోపిచ్చి!!

ఫోటోలంటే పిచ్చ ప్రేమ నాకు 
  
ఎందుకంటే...మనిషి మారినా

ఎప్పటికీ అవి మారక మురిపిస్తాయి

నీలోని లోపాలను నీకు చూపిస్తాయి

ఒంటరై ఏడిస్తే ఓదార్పై నవ్విస్తాయి

ఎన్నటీకీ వయసు పైబడనంటాయి

విడిపోయిన బంధాలని బలపరచి 

మరచిన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి! 

Monday, January 30, 2017

!!పరిశోధన!!

నోటిమాట వినే వారే అందరూ
మనసు పడే వేదన వినరెవ్వరూ
శబ్దాలతో మారుమ్రోగు సంతలో..
నిశ్శబ్దాన్ని గుర్తించేవారు ఉండరు
అక్కరకురాని ఎన్నో ఆలోచనలు
ప్రేమ సంపాదన బంధాలు అంటూ
అనవసర చర్చలు సమావేశాలు..
ఆర్జించింది ఎంతో కోల్పోయిందేమిటో
       తెలుసుకునే ప్రక్రియలో ఫలితం శూన్యం       
శతాబ్దాలుగా దొర్లుతున్న పరిశోధనలో   
సాగుతూనే ఉంది శాంతి కొరకు శోధన!!

Wednesday, January 18, 2017

!!హైటెక్ లైఫ్స్!!

సుఖఃసాధనాల నడుమ యాంత్రికజీవులు
అనుభూతుల్ని దాచే దర్పాలు ఢాంబికాలు
మసకల ముసుగులో అనిశ్చల గమ్యాలు
అలరించే రంగుల్లో రాగంలేని అనురాగాలు
మమతలకు మరకలు అంటి అరమరికలు
ఆదరణ ఆప్యాయతలు జ్ఞాపకపు చిహ్నాలు
ఆనందాల్ని సుడిగుండంలోకి నెట్టిన వ్యధలు
నిరాశ నిట్టూర్పుల్తో బంధించబడ్డ బ్రతుకులు
సంతోషాలని సంతలో వెతుక్కునే ప్రాణులు
నేటి కృత్రిమ హైటెక్ ఆశ్చర్యకర జీవితాలు!!

Wednesday, January 11, 2017

!!పయనం!!

నా పాదాలకున్న పగుళ్ళు
నన్ను పదే పదే వారిస్తున్నా
ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నా
నా తనువును సేదతీర్చాలని
గాలితెమ్మెర పవనాలు వీస్తున్నా
కృషిచేయాలని కంకణం కట్టుకున్నా
నా మనసుకి హాయిని ఇవ్వాలని
కమ్మనైన రాగం వింటున్నా...
ఉత్సాహంగా గమ్యంవైపు సాగిపోతున్నా!

Wednesday, January 4, 2017

!!మృత్యువు!!

నేను నమ్మిన వారే నన్ను మోసగిస్తే

గాయమైన గుండెకే గాయమౌతుంటే

నిజాయితీ లేని వారు సైతం నీతి చెప్ప

కొరగాని వారు కూడా కోపంతో చూడగా

కుళ్ళు కుతంత్రాలు కబళించి కన్నుగీట 

ఇష్టంలేని క్రియలే కౌగిలించి కాటువేయ

భయపడతాయి అనుకున్నవి బంధించ 

మృత్యువుని మాత్రం మోహించి రమ్మని

బాహటంగా పిలువ భయమేలనో దానికి!

Sunday, January 1, 2017