Wednesday, March 29, 2017

!!హేవిళంబి స్వాగతం!!

ఏ ఏడాతికాయాడాదే ఆహా హో అనుకుంటూ 
అంతా మంచి జరుగునని గెంతులేసుకుంటూ
గడచిన కాలం తిరిగిరాదని వచ్చేది గొప్పదని 
జీవితమంటే షడ్రుచుల సమ్మేళనమని సర్దుకుని
సంకలెగరేసి సంబరపడినా కాదని చతికిలబడినా
పంచాంగ పారాయణం చేసి పళ్ళు ఇకిలించినా
జరిగేది జరుగకా మానదు బ్రతుకు మారిపోదు
కోయిల కూసిందని కాకి అరవడం మానేయదు!
బ్రతకడానికి తినే తిండిలో రుచులు తగ్గినా తిని
కారాన్ని మమకారం నుంచి తీసి తీపిని పెంచు
చేదు చేబదులిచ్చి ఉప్పును నిప్పుగా మార్చకు
మాటలకు పులుపు చేర్చి వగరుతో పొగరుబోకు
ప్రతి మనిషీ....నిర్మల నిశ్చల సమున్నతమై
సాటి వారిపై సానుభూతి ఉంచి మసలితే చాలు
ప్రకృతి ప్రతిరోజూ పులకరించి వసంతాన్ని పంచు
అది చూసి ఇంటింటా పండుగ వద్దన్నా నర్తించు!
హేవిళంబి తెలుగు సంవత్సరమా నీకు స్వాగతం..

Friday, March 24, 2017

!!వేర్పాటు పవనాలు!!

ద్వేషం చేసిన దుష్ఫలమో లేక మనిషి గుణమో 
జంతువులు రెండుగా విభజించబడ్దాయి..
ఆవులు హిందువు మేకలు ముస్లిం అయ్యాయి
మధుషాలలో మాత్రం మనిషి అవతారం అగుపడ
చెట్లూ పుట్టలు ఆకులూ అలములు కలతచెందాయి!
పక్షులు పావురాలు కూడా హిందు ముస్లింలైతే..
ఎలాగని ప్రశ్నిస్తూ ఎండిన గింజలు ఏడ్చాయి
కొబ్బరికాయ హిందూ ఖర్జూరం ముస్లిమైనట్లే తెలీదని
ఆకలిప్రేగు అసలు విభజన ఏమిటి? ఎందుకన్నాయి!
వేర్పాటు వాదులకు విడిపోవడం అచ్చొచ్చెనేమో..
కానీ..నా వాదనలు మాత్రం అత్యోత్సాహ పడనన్నాయి!

Wednesday, March 22, 2017

!!ప్రయత్నం!!

నీటి పైపైన ఈదితే..
లోనున్న ముత్యాలు దక్కవు!
అభ్యాసన చేయకపోతే..
అనుభవం రమ్మంటే రాదు! 
ముఖానికి రంగులద్ది..
మనసులో మర్మం మార్చలేవు!
పూలను తూచి..
రాళ్ళ బరువెంతో చెప్పలేవు
చేయలేనని నిరుత్సాహపడితే..
అనుకున్నది ఏదీ సాధించలేవు!!

Tuesday, March 14, 2017

!!వాటి నైజం!!

నాటనివాడు చెట్టు నరికినా
వాలిపోయే వరకు నీడనిస్తుంది
అది ఎదిగిన చెట్టు నైజం...

నీరుని వృధాగా పారబోసినా
మురికి ఉంటే కడిగేస్తుంది
అది మంచినీళ్ళ తత్వం...

తొక్కి మొక్కునని గుడిమెట్లెరిగినా
దేవుని సన్నిధికి తీసుకెళుతుంది
గుడిమెట్లకున్న ఉదాత్త గుణం... 

Wednesday, March 8, 2017

!!ఓ మహిళా!!

బలమైన స్త్రీ ఎంత లోతుగా ఆలోచిస్తుందో
అంతకు రెట్టింపు ప్రేమను పంచుతుంది!!

ఎంత సున్నిత మృదువైన మనసు కలదో 
అంతకు మించిన శక్తిసామర్ధ్యాలు కలది!!

ఎంత మనస్ఫూర్తిగా నవ్వులు చిందిస్తుందో 
అంతే వ్యధను మదిలో దాచుకుంటుంది!!

ఎంత ఆచరణాత్మకంగా పనులు చేయగలదో 
అంతగానే అధ్యాత్మికపై ధ్యాస పెడుతుంది!!

బలమైన మహిళ తనకు తానే సారాంశము
ప్రపంచము పొందిన వరానికి నిర్వచనము!!

Friday, March 3, 2017

!!ఎంత బాగుండు!!

ఋతువు మారెనని గాలితెమ్మెర గాబరాపడె
పూల పుప్పడినేమో తుమ్మెద జుర్రున దోచె
జీవిత స్థితిగతులు మార గుండె గుబులాయె
ఈ వంకన నేను మారితే మరింత బాగుండునే!

వీధీ వాకిలి పాతదైనా కొత్తవెలుగు దానిపైపడె
చిలిపితనమేమో కుప్పిగెంతులు వేస్తూ ఎగిరె  
మదిరూపమే మారి అదృష్టం తలక్రిందులాయె
ఇలా సాకులతో నా స్థితి మారితే బాగుండునే!

ఆశయాలు ఆకారాన్ని మార్చేసి కుంటుపడె 
నవ్వడం మరచిన ముఖం కన్నీటితో తడిచె 
వలస పక్షులు వచ్చినట్లే వచ్చి పైకెగిరిపోయె
ఇదే అదునుగా నేను ఎగిరిపోతే బాగుండునే!