Wednesday, July 31, 2013

ఏం సాధించేవు!

గోల చేసి గోడలు కట్టి ఏం సాధిస్తావు
వారధివేస్తే వందమందికి దారిచూపేవు

మనసు విరిచి మంచి మనుగడంటావు
కనులుమూసి పగటినేం రేయిగ
మార్చేవు

మేల్కొనిసాగక సోమరివై ఎందుకున్నావు
మాటలకన్న చేతలతో ఏదైనా సాధించేవు

చేతకాక చెప్పే సారంగ నీతులేం వింటావు
వంక లేక డొంకట్టుకుని వ్రేలాడుతున్నావు

పట్టుదలుంటే ఆశయానికి ఏవీ అడ్డురావు
అనుభవాల కళ్ళకి ఆదర్శాలు అచ్చిరావు

Saturday, July 27, 2013

రోగి

మనిషి రోగానికి మందేయగలను
మానసిక రోగానికి మందేమివ్వను
పుండు పడితే చికిత్స చేయగలను
పుచ్చుపడ్డ ఆలోచనలను ఏమనను
మతితప్పినవాడు మానసికరోగి అగును
మదమెక్కినవాడు మట్టికొట్టుకు పోవును

Tuesday, July 23, 2013

బాలేదు

ఒడ్డుచేరి తెడ్డును మరువడం నచ్చలేదు
కాగితపు నావ నీట మునగడం బాలేదు
వర్షంలో ఆటలాడి తుమ్మడం గుర్తులేదు
అప్పటి తడి ఇప్పుడు చెడనడం బాలేదు

తనకై భావోధ్వేగాలని చంపడం నచ్చలేదు
స్వార్థై మనిషి మనిషిపై గెలవడం బాలేదు
మనిషి మృగంగా మారడంలో అర్థమేలేదు
జీవించాలని ఇతరుల్ని భాధించడం బాలేదు

ప్రేమకై తల్లిదండ్రులని వదలడం నచ్చలేదు
జీవితాన్నిచ్చినవారినే తప్పనడం బాలేదు
నీకంటనలుసేరి వాళ్ళు ఏడవడం జ్ఞప్తిలేదు
అటువంటివారిని రోజూ ఏడిపించడం బాలేదు

Sunday, July 21, 2013

//జీవితం//

జీవితాన్ని శింగారించుకోవాలని..
నమ్మకాన్ని జ్యోతిగా వెలిగించాను
జీవితమెంతో అందం ఆనందమని
ఆదర్శాలని పూమాలగా అల్లాను
జీవితంలో అందరూ నావాళ్ళేనని
గుంపులో దాగి ఒంటరినయ్యాను
జీవితం పరచిన తివాచీ అనుకుని
నగ్నపాదాలతో నడవక నర్తించాను!

జీవితాన్ని దగ్గరగా చూడగలిగితే..
అప్పుడే జీవితాన్ని జీవించగలను
జీవితానందవ్యధని సమంగా భరిస్తే
అహ్లాదం అందులోనే కనిపించేను
జీవితానుభవ కళ్ళగంతలు విప్పితే
అసలు రూపమేదో అగుపించును
జీవితమే శాశ్వితం కాదని తలుస్తే
ప్రతీక్షణం విలువ ఎంతో తెలిసేను!

Tuesday, July 9, 2013

ఎందుకిలా!


కన్న కలలన్నీ అలిగి కళ్ళని వెలివేస్తే
నిదురించమని కనులని బ్రతిమాలనేల!
కోరిన కోరికలన్నీ అందకుండా చేజారిపోతే
గమ్యమే దారిమరచి దారి చూపమననేల!
అదృష్టద్వారమే తట్టవలసిన తలుపేదంటే
మార్గాలు ఎన్నుండిమాత్రం ప్రయోజనమేల!
జీవిత ఆశయమే ధూళిలో కలిసి ఎగిరిపోతే
మేల్కుని నవ్వుతూసాగమని ఉసిగొల్పనేల!

Friday, July 5, 2013

నడచిచూడు.

మనిషిగా మారిచూడు,
లోకమేమారి నీ మార్గమౌతుంది....
నిశ్చలంగా ముందు నువ్వు నిలబడు,
ఈ లోకమే నీదౌతుంది....
పరులకై కూడా కొంత పాటుపడు,
వారి జీవితమే నీకంకితమౌతుంది....
ప్రేమను పంచిచూడు,
పాషాణ హృదయమైనా పటాపంచలౌతుంది....
మంచిగమ్యాన్ని ఎంచినడు శూలాలుసైతం, 
పూలబాణాలై పాదాలపై పడుతుంది....
అపరిచితుడిగా పయనించు అప్పుడప్పుడు,
నీదైన జీవితం హాయిగా సాగిపోతుంది....
సమాధిచేసి నీలోని చెడు నిన్ను నీవు గుర్తిస్తే,

మానవజన్మకొక సార్థకత చేకూరుతుంది!!!!