Wednesday, October 30, 2013

!!చెప్పనా!!

ఎప్పుడూ నిరాశా నిర్వేదమేనా అంటే ఏం చెప్పను..
అనందాన్వేషణలో దొరికిన నిధులు ఇవ్వని చెప్పనా!

ఎప్పుడూ ఆలోచించడంలో ఆంతర్యమేమని చెప్పను..
ఆశయాన్ని ఆలోచనల్లో ఆస్వాధిస్తున్నానని చెప్పనా!

ఎప్పుడూ అనుకున్నవన్నీ జరగవు అంటే ఏంచెప్పను..
ఆశాకిరణాలే జీవితాన్ని ముక్కలు చేశాయని చెప్పనా!

ఎన్నటికీ నెరవేరని కోరికలతో కడవరకూ ఎలా సాగను..
అందుకే నా ఉనికిని నేనే అంతం చేస్తున్నానని చెప్పనా!

అంతమైతే ఆశయావేదన తీరునా అంటే ఏమని చెప్పను..
అలా అంతమై మరో ఆశయానికి ఊపిరౌతానని చెప్పనా!!

Monday, October 28, 2013

!!నిరీక్షణ!!

వస్తావన్న ఆశతో పర్ణశాలలో పచ్చిక పరిచా
నిరీక్షణా క్షణాలెన్నో బరువెక్కాయి నీవురాక

గతస్మృతులే నవ్వుగా చెక్కిళ్ళపై శింగారించా
వేదనపుఛాయ చారికలు నీకు కనబడనీయక

ఆశపడ్డ మనసునే మఖ్మల్ దుప్పటిగా వేసా
రెక్కలు కట్టుకుని వస్తావని కలని కరగనీయక

ఆలస్యంతో నమ్మకాన్నే విరిచేసావు వృధాగా
అల్లుకున్నబంధం ఎదురుచూసింది ఆశచావక

ప్రేమపాశమేదో ఊగుతుందింకా నట్టేట్లో నావలా
నాజూకు గాలమేస్తే ఒడ్డుచేరునా నావ మునగక

ఎదురుచూపులన్నీ దాడిచేసాయి శత్రుసైన్యంగా
అద్దమే భయపడింది ఏడ్చిన మోము చూడలేక

మరణం ఎంతో చేరువౌతుంది కాలంతో పాటుగా
చావంటే భయంకాదు నీవు ఉండలేవు నేనులేక

Wednesday, October 23, 2013

!!అవిటి ఆకలి!!

అమాయకమైన ముఖం
ఆర్తిగా చూస్తున్న చూపులు
కడుపులో రగులుతున్న ఆకలి
ఎండకు మాడతానన్న భయంలేదు
చలివణుకుడును సైతం లెక్కచేయడు
చిరిగిన దుస్తులు, చీమిడికార్చే ముక్కు
మోకాలికైన గాయం నుండి స్రవిస్తున్న రక్తం
అయినా వాడిలో లెక్కచేయని మొండి నిర్లక్ష్యం
ఆకలిని ఎదిరించి పారిపోవాలి అన్నదే వాడి లక్ష్యం
అంతలో....ఆకర్షిందా పిల్లవాడ్ని ఆకలిగొన్న అవిటితనం
ఎదురుగా మరో పిల్లవాడు రొట్టెముక్కలు కూర్చుని తినడం!!

Saturday, October 19, 2013

!!ఇలా ఎలా?!!


పరిమళాలన్ని కూర్చి అత్తర్లుగ అందించేసాక..
ఇప్పుడు వాసనలేని కాగితపు పువ్వంటే ఎలా?

కన్నకలలు కానేరవంటూ కనులు వెలివేసాక..
వేరొకరి కలలు తీర్చే మార్గం చూపమంటే ఎలా?

పోషించిన ప్రేమపాశాన్ని పోల్చి పరిహసించాక..
పశ్చాతాప పడక పాషాణంగా మారమంటే ఎలా?

నమ్మకపు వంతెనే నాణ్యత లేక కూలిపోయాక..
ఆశచంపి జీవంలేని కోరికలు కోరుకోమంటే ఎలా?

వెలుగుని పంచి చమురులేని దీపమై మిగిలాక..
మిణుకువలె మెరిసే దీపాన్ని వెలగమంటే ఎలా?

ఉదరము నుండి ఊపిరిని వేరవమని శాసించాక..
గడిచిన కాలాన్ని తిరిగి రమ్మని జీవించడం ఎలా?

Tuesday, October 15, 2013

!!ఏదో ఆశ!!

మూసిన తలుపు తెరుచుకుని మార్గమేదో కనపడింది
ఆలోచనలు తెగి బంధం జైలు నుండి విడుదలయ్యింది

నిరాశ నుండి భావోధ్వేగాల ఆశాకిరణం  ఉదయించింది
చీకట్లో నా శరీరం నుండి నా నీడే వేరై విడివడి పోయింది

ఆనందం నవ్వుతూ కష్టాల్లో తనని కౌగిలించుకోమంది
ఆత్మస్థైర్యమే నన్ను వీడక నాకు తెలియని బంధమైంది

గతించిన దానికి ఫలితమంటూ మది దాహార్తిని కోరింది
కంటికి ఎదురుగా మరో కోణమేదో నీటిపాయగా పారింది

దుమ్ము పొరలను దులిపి తుడిచిన అద్దం నిగారించింది
సమయమే పరిమళం అందించి గమ్యం చూపబోతుంది!

Thursday, October 10, 2013

!!సర్దుకుపోవడమేల?!!

సంతోషం అంటే మనకి నచ్చింది చేయడం!!!
వేరొకరికి నచ్చినట్లంటే మనసు చంపుకోవడం
ఇంకొకరి సంతోషాన్నిచూసి మనం తృప్తి పడ్డం
చేతకానితనంతో ఏం చేయలేక సర్దుకుపోవడం
ఇది కప్పిపుచ్చి మాట్లాడ్డమే సూక్తులు చెప్పడం
జవాబీయలేని ప్రశ్నలని వితండ వాదన అనడం
మరీ విసిగిస్తే మొండితనమని మాట్లాడకపోవడం
అనుకున్నవి ఎంత ప్రయత్నించినా జరగకపోతే....
అన్నింటికీ సర్దుకుని సాగిపొమ్మని సలహా ఇవ్వడం
ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఇదే నిజమైతే....
సరైనదైతే ఎందుకు సాధించేవరకు పోరాడమనడం?

Saturday, October 5, 2013

!!ఓ...నా మనసా!!

ఓ.......నా చంచల మనసా చలించకే
అపరిమిత ఆలోచనలతో జ్వలించకే
అన్నీ నీకే కావాలని హైరానా పడకే
ఆశించి అవమానంతో అల్లరికామాకే!

ఓ........నా మనసా నన్ను నిర్దేశించవే
ఎగసే కోర్కెలకి కళ్ళెంవేసి బంధించవే
నిన్ను నమ్మిన నన్ను నీవెదిరించవే
వినని నీతో నీవే పోరాడి గెలుపొందవే!

ఓ.......నా మనసా నాకే రెక్కలు ఉంటే
ఆకాశంలో నీతో పక్షిలా ఎగురుతుంటే
కష్టాలన్నీ కడలిలో కొట్టుకు పోతుంటే
హద్దులేని ఆనందమంతా మనవెంటే!

ఓ.......వెర్రి మనసా ఇదిమాత్రం చిత్రమే
తలచినది జరిగితే అది బహువిచిత్రమే
జరిగేది ఏమైనా మంచి అనుకోవడమే
మనం తెలుసుకోవలసిన జీవనసారమే!