Thursday, December 31, 2020

Happy New Year-2021

ఎప్పుడూ ఏదో కొత్తగా చెయ్యాలి అనుకునే నాకు...
సెల్ఫీలు తీసుకోవటం సరదాగా తయారయ్యింది అనడానికి ఫ్రూఫ్
నా ఈ సెల్ఫీ వీడియో..."New Year Greetings"
Please see and smile-Be happy  

Tuesday, December 29, 2020

!!బొంగుచికెన్!!


మారేడుమిల్లి అటవీప్రాంత అందాలు తిలకించి 
బొంగులో చికెన్ రుచిని చూసి ఆస్వాధించండి! 

Saturday, October 31, 2020

!!అప్పుడు ఇప్పుడూ!!

 జీళ్ళూ జంతికలు రూపాయికి రెండూ కొనుక్కుని తిన్నాం..
ఇళ్ళు చిన్నవి అయినా అందరి హృదయాలు పెద్దగా ఉండేవి
స్పేస్/ప్రైవసీ వంటి పదాల అర్థంతో అసలు అవసరంపడలేదు
ఎందుకంటే...అందరి ఇంటిపై కప్పులూ ఏకమై కలిసుండేవి
పొరుగు వారికి సైతం మన బంధువుల పేరులు తెలుసుండేవి
వేడి అన్నం నెయ్యి పప్పు పచ్చళ్ళతో కడుపునిండా తిన్నాక
మిద్దెపై వరుసగా పడకలేసి పిచ్చాపాటి కబుర్లతో పడుకునేవారు
కష్టసుఖాఃలు మనసువిప్పి మాట్లాడుకుని పరిష్కరించుకునేవారు 
ఆనందం అధికంగా ఉండి అహం తంత్రాలకు చోటుండేది కాదు!
మరి ఇప్పుడో..
ఇళ్ళు విశాలంగా ఉంటున్నా మనసులు కలవర పడుతున్నాయి
చిన్నా పెద్దా అందరికీ ఎవరి గది వారికే ఏడుపు నవ్వు గోప్యమే
ప్రతొక్కరి చేతిలో మొబైల్ అందులోనే హాయ్ బాయ్ పలరింపులు
గదులేమో AC తో చల్లన ఒకరి ఉన్నతి చూసి ఒకరికి మంట లోన! 

Wednesday, October 7, 2020

జీవితం అలసిపోతుందిప్పుడు!!


జీవితం ఇప్పుడు క్రమంగా అలసిపోవడం మొదలెట్టింది..
అందరూ ఏదో విధంగా మార్పు చెందుతున్నారు..
పొట్టపెరిగి బట్టతలవచ్చి జుట్టునెరసి ఉన్నారు..
కొందరు ఫిట్నెస్ కోసం ప్రాకులాడుతుంటే
మరికొందరు ఉండి మాత్రం చేసేది ఏంటి అనుకుంటున్నారు..
ఏది ఏమైనా అందరిలోనూ ఏదోక మార్పు..
బరువు భాద్యతలతో కొందరు ఏమీ లేక మరికొందరు బెంగపడుతున్నారు..
బీపీ షుగర్ కీళ్ళనొప్పులు చూపు మందగించి బాధగున్నారు..
చెప్పి కొందరు చెప్పక మరి కొందరు కాలం గడుపుతున్నారు..
ఏదోలా అందరి వయసు పెరుగుతుంటే కాలం తరుగుతుంది..
మొత్తానికి సమయం సాగుతూ జీవితం అలసిపోతుంది!!!

Thursday, September 24, 2020

!!బీ హ్యాపీ!!

యవ్వనంతో మిడిసిపడకు రేపు చింతిస్తావు
ఉదయించే సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తాడు
కొన్నాళ్ళు కొనసాగే జీవిత బాటసారివి నువ్వు
రిక్తహస్తాలతో ఏడుస్తూ వచ్చి ఏడిపించి పోతావు

మూడునాళ్ళ ముచ్చటేనని తెలిసి మురుస్తావు

జీవితాన్ని చూసి ఏడుస్తాడు జీవితం తెలిసినోడు
అనవసరంగా ఆలోచించి ఆందోళన చెందే నువ్వు
అన్నీ తెలిసి కూడా ఎందుకనో ప్రాకులాడుతావు

గర్వంతో తలెత్తి నడిచావో తలకు బొప్పికడతావు

చావు నుండి ఎవరైనా ఎంతని తప్పించుకోగలరు
సమాధియే చివరి గమ్యం చెప్పకుండా పాతేస్తారు
ఓహ్ గుండే..ఉన్నంత వరకూ హాయిగా ఉండు!

Thursday, September 10, 2020

!!నిశ్చింత నిద్ర!!


నేను మంచి నిద్రలో ఉన్నట్లు ఉన్నాను...
నిద్రలో నాకు జాగ్రత్తగా స్నానం చేయించారు
ఇంట్లో అందరూ ఏదో కొత్త ఆట ఆడుతున్నారు
చిన్నవాళ్ళని భుజాలపై ఎత్తుకున్నట్లు నన్నెత్తి
అటూ ఇటూ తిప్పి కదలకుండా నన్ను కట్టారు
నా చుట్టు గుమ్మిగూడి ఏవో మాట్లాడుతున్నారు
ఏడుస్తూ మనసులో మరచిపోవాలనుకుంటున్నారు
ప్రేమగా ఎప్పుడూ నావైపు చూడని వారు కూడా
ప్రేమను చూపిస్తూ లోలోన తొందరపడుతున్నారు!

ఎందుకో ఏమో తెలియదు నిద్రిస్తున్న నన్ను చూసి
గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నన్ను నిద్ర లేపుతున్నారు
హైరానా పడిపోతూ హడావిడిగా తిరుగుతున్నారు!!

నా శరీరం ఎందుకో బిగుసుకుంది ఆ స్థలం చూసి
ఎక్కడైతే నన్ను శాశ్వితంగా పడుకోబెట్టనున్నారో!
ప్రేమ అనుబంధాలకు పరీక్ష పెట్టారు కామోసు..
వారి చేతులతో నాకు నిప్పు పెట్టి వెనుకకు తిరిగి
చూడకుండా వెళ్ళిపోయారు, హమ్మయ్య ముగిసింది
ఇక రోజూ నిద్ర లేవాల్సిన పనిలేదు...గుడ్ బైయ్!!




Sunday, July 19, 2020

!!ఎవ్వరూ రారు!!


తలుపులు బార్లా తీసి ఉంచినా లోపలికి ఎవ్వరూ రారు
వెన్నెల విరబూసున్నా జాబిలిని ఎవ్వరూ పలుకరించరు
ఇప్పుడు పూలవాసన్ని ఆకులూ ముళ్ళే పీలుస్తున్నాయి
పక్షుల కుహకుహలు కూడా రోదనలుగా వినిపిస్తున్నాయి
ఈ నమ్మశక్యం కాని నిజమైనా చూడ్డానికి ఎవ్వరూలేరు!

కష్టాల్లో హితులు పలుకరించడానికి రావాలనున్నా రాలేరు
కడుపున పుట్టిన వారిని అయినా సరే ముట్టుకోవద్దంటారు     
భ్రమరాలు సైతం పువ్వులలో తేనె ఝుర్ర ఆలోచిస్తున్నాయి
సీతాకోకచిలుకల రెక్కలు కూడా ఎగురలేక అతుక్కున్నాయి
ఈ విపత్కర పరిస్థితుల్లో నాలుగ్గోడలే స్వర్గం అంటున్నారు!

ఒంటరిగా అరచి గోలచేసినా వినడానిక్కూడా ఎవ్వరూ లేరు   
కరోనా సోకిన రోగి శవంపై దుప్పటి కూడా ఎవ్వరు కప్పరు
అందుకే గుంపుగా ఉండొద్దు దూరాన్ని పాటిద్దాం అంటున్నది
అత్యవసరం అనుకుంటే తప్ప ఇంటిపట్టునే ఉండమంటున్నది
ఈ మహమ్మారికి ఇంతకు మించిన పరిష్కారము లేకున్నది!

Wednesday, July 15, 2020

Friday, July 3, 2020

!!తెలిసింది!!

ఒంటరిగా ఉన్నప్పుడు నన్నునేను చూసుకుని ఆలోచిస్తూ
మనసుకి వేసుకున్న ముసుగులన్నీ తీసి నగ్నంగా నిలబడి
నాతోనేనే మాట్లాడుకుంటూ నన్ను నేనే తిట్టుకుని తర్కిస్తే..

అప్పుడు ఒక్కసారిగా నన్ను నేను పోల్చుకుంటే తెలిసింది
నాకు కనిపించే మీరు, మీకు కనిపించే నేను ఒకటి కాదని!

నేనెవరని చేస్తున్నవి సబబేనాని ప్రశ్నించుకుంటే తెలిసింది
నిజం నిష్టూరమైనా చెప్పి గరళాన్ని మ్రింగేసినా ఏం కాదని!

నన్ను కాపాడుకోడానికి నానీడను బోనులో బంధిస్తే తెలిసింది
తోడు కోసమని నాది నాది అనుకున్నది ఏదీ నాది కాదని!

Tuesday, June 23, 2020

!!నాలో నేను!!

నా ఆలోచనలు ఎన్నో యోజనాలు పయనించి 
తమలోతామే సుధీర్ఘంగా చర్చించుకుంటాయి... 
స్వార్థసంకుచితాలు ఒకవైపు, సహాయసహకారాలు మరోవైపు
తర్జనభర్జనల నడుమ మానవత్వం ఆచరణాయోగ్యమై 
మలినమంటని మనసు తర్కం అనవసరమని రాజీపడుతుంది!
  
నా వివేకం నైతిక మూలాల్లేని విలువల్ని ఏరిపారేసి 
కొత్త దృక్కోణంలో తమనితామే ప్రశ్నించుకుంటాయి...
కళ్ళతో చూసినదే యదార్ధమని, చెప్పిన మాటలు వినక
వేదహిత సద్గతిలో సాగే సాధనే జీవనపయన మార్గమని  
తాను నమ్మిన సిద్ధాంతాలు ఎంత కష్టతరమైనా ఊడిగం చేస్తుంది!   
   
అదేనేమో నన్ను ఆకాశమంత ఎత్తుకు ఎగురవేసిన నా వ్యక్తిత్వం
అందరికీ నచ్చనిది ఆ తత్వం...అయినా అదే నా అస్తిత్వం!!! 

Thursday, June 18, 2020

!!బ్రతకడమంటే!!

గుర్రం ఎక్కినంత సులభం కాదు స్వారీ చెయ్యడం 
శిక్షణ ఆచరణ అనుభవ చాకచక్య నైపుణ్యం కావాలి

చేతిలో చెయ్యివేసి చెబితే అయిపోదు బాస వెయ్యడం
ఓర్పు నేర్పు ధీక్ష నెరవేర్చాలన్న పట్టుదల ఉండాలి

సక్రమంగా సమకూరితే సాధించేది కాదు విజయమంటే
అడ్డంకులు ఎన్ని ఎదురైనా వాటిని ఖండించి గెలవడం

చదవడం చూసి తెలుసుకోవడమే కాదు జ్ఞానమంటే
అనుభవజ్ఞులు చెప్పిన వాటిని కూడా శ్రధ్దగా వినడం

ప్రయత్నించి ఓడితే దారిమార్చుకునేది కాదు ధ్యేయం
కష్టాలుపడి సరికొత్తదారి తవ్వుకొనైనా చేరాలి గమ్యం

నలుగురూ ఏమనుకుంటారోనని బ్రతికేది కాదు జీవితం
ఆరునూరైనా అనుకున్నది చేసి శభాష్ అనిపించుకోవడం 

Wednesday, June 10, 2020

!!నిచ్చెనెక్కి!!

ప్రేమను పంచితే ప్రేమే దక్కుతుందని నమ్మి
లోకానికి లెక్కలేనన్ని లవ్ లెటర్స్ రాసాను 
ధ్వేషాన్ని కూడా ప్రేమతో జయించవచ్చునని 
ఓడిపోయిన ప్రతీసారి ఓటమినే ప్రేమించాను!  

ఎగిరితే ఎగిరాను ఎప్పుడైనా ఎగిరిపోయేదేనని
ఎదుటివారి ఎదలో ఒదిగి ఉండాలనుకున్నాను
ఊతమిచ్చి ఊరడించాననుకుని ఊహించుకుని
నమ్మి బొక్కబోర్లాపడి బొడిపికట్టించుకున్నాను!

సిద్ధాంతాల నిచ్చెనెక్కి నిటారుగా నిలబడాలని
చేసిన సహాయాలు అన్నీ చిత్తశుద్ధితో చేసాను
అవసరానికి హారతులుపట్టి ఆపై ఆర్పివేస్తారని
తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తున్నాను!

Monday, May 18, 2020

కాలంతో...ఖబడ్దార్


కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే..
కాలం కలిసొస్తే కబుర్లు ఎన్నైనా చెబుతాం
కాలాన్ని కదలకుండా ఆపడం ఎవరి తరం
కాలంతో పెట్టుకుంటే కాలి బూడిదైపోతాం!

Tuesday, April 28, 2020

!!పేకముక్క!!


జీవితపు 52 పేకముక్కల్నీ లు
అందరికీ సమానంగానే పంచుతారు
ఎలా ఆడాలో మనచేతిలో ఉంటుంది!

రాజు రాణి ఆసు ఏదైతేనేమి
పేకాట ఆడితే జోకర్ ముక్కా
మనవారు మనకు ఇచ్చే ధక్కా
మొత్తం ఆటనే మార్చిపడేస్తుంది!

జీవితం పేకముక్కల వంటిదే కదా.. 
గెలిచినా ఓడినా ముక్కలు చూపించాల్సిందే  
ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రతకవల్సిందే!!

Thursday, April 23, 2020

!!ఆధారం!!

ఎండిన చెట్టు ఆకుల్ని చూసి కూడా నవ్వుతున్నాంటే
అది నాపై నాకున్న ఆత్మవిశ్వాసం, అంతే కానీ...  
నేను పోతే నన్ను కాల్చడానికవి పనికొస్తాయని కాదు!

ఎవరినో నమ్మి వారిలో నన్నునే చూసుకుంటున్నానంటే
అది నా అసమర్ధత నిస్సహాయతా, అంతే కానీ...
వారిని అవసరానికి వాడుకుని వదిలిపోయే రకం కాదు!

ఎండిన చెట్టు మరలా చిగురించి గాలికి ఊగక మానదు
ఎదిగినవాడు ఎంత మనవాడైనా ఎగిరిపోక మనకై ఆగడు

Sunday, April 12, 2020

Amma...Miss you



ఆదివారం ఉదయం ఆలస్యంగా లేచే మాకు అమ్మ ఫోన్ కాల్ మేల్కొల్పు.
అమ్మాయ్..లేచావా!? ఏమి టిఫిన్ చేసావ్?...(చేసుకోలేదంటే) అయ్యో...అదేంటే ఏమైనా చేసుకుని తినమని తినకపోతే ఎలా నీరసం వస్తుందనేది....ఆదివారం కదా ఏమైనా స్పెషల్ చేసుకుని అబ్బాయికి(అల్లుడికి) పిల్లలకి పెట్టి నువ్వూ కాస్త తిను అనేది.
అంతలోనే ఆదివారం కదా..వీలుంటే ఇంటికి రండి ఇక్కడ వండుకుని అందరం కలిసి తిందామని చెప్పేది. ఉన్న ఆదివారం ఎన్నో పనులు ఊరికే రమ్మంటావని అప్పుడప్పుడూ విసుక్కున్నా ...లంచ్ టైంకి చేరి అందరం కలిసి తినడంలో ఉన్న ఆనందం అమ్మతోనే పోయింది. 
ఇప్పుడూ ఆదివారాలు వస్తున్నాయి యధావిధిగా పనులన్నీ జరిగిపోతున్నాయి...
కానీ..అమ్మ మేలుకొల్పు ఫోన్ కాల్ మిస్సింగ్..
తిన్నావా!? ఏమి వండుతున్నావు!? ఏమైనా చేసుకో తిను అనే అమ్మ మాటలు మిస్సింగ్.
అమ్మను స్మరిస్తూ అక్షరాంజలి..అమ్మ మృతి వీక్షణాఖంఢిక. తల్లి ఋణం ఎప్పటికీ తీరదు-పద్మారాణి

Note:-అందరూ ఆనందకరమైన వీడియోలను చేసిపెడతారు, నేనేంటి ఇలా ప్రాణం పోతున్నప్పటి వీడియోని పెట్టానని తిట్టుకోకండి.
ఊపిరి పోసుకున్నప్పటి నుండి ప్రాణం పోయే వరకూ జరిగే పరిణామాల్లో ఆనందాన్ని మాత్రమే ఆస్వాధించి మరణానికి మాత్రం భయపడి చూడకుండా తలచుకోకుండా ఉండడం ఎందుకు?
"పుట్టినప్పుడు పుట్టే వాళ్ళు ఏడుస్తారు....
పోయేటప్పుడు చూస్తున్నవాళ్ళు ఏడుస్తారు!"

Tuesday, March 31, 2020

లాక్ డౌన్ జిందాబాద్

ఏదో కొంప మునిగిపోయిందన్నట్లు ఆందోళన ఎందుకు? 
సూర్యోదయం ఆగలేదు మీలో ప్రేమనూ లాక్ చెయ్యలేదు  
బయటకు రావద్దన్నారే కానీ మీలోని కళల్ని కట్టేయలేదు
మీలోదాగిన కరుణను దయను కప్పి పెట్టమని అనలేదు!

మూసి మిమ్మల్ని బంధిఖానాలో వేసారనుకోడం ఎందుకు?  
మీలో దాగిన సృజనాత్మకతను సంకెళ్ళతో లాక్ చేయలేదు
కొత్త విషయాలు తెలుసుకోవద్దు నేర్చుకోవద్దనీ బెదిరించలేదు
మీ ఇంట్లో నలుగురూ కలిసి ముచ్చటించుకోవద్దు అనలేదు! 

విద్యా విజ్ఞానాన్ని కాల్చి బూడిద చేసినట్లు చింత ఎందుకు?
బంధువులతో కలవద్దన్నారే కానీ బంధాల్ని లాక్ చెయ్యలేదు 
ప్రార్ధన ధ్యానం దర్జాగా తిని హాయిగా నిద్రపోవద్దనీ చెప్పలేదు
మీ ఆశలను ఆశయాలను అణచుకోమని అస్సలు అనలేదు!

ఇంట్లో నుండి పనులు చేస్తూ ఎంజాయ్ చెయ్యమనడం తప్పా?
లాక్ డౌన్ అన్నది చెయ్యాల్సింది చెయ్యడానికిచ్చిన ఒకవకాశం
ఇంట్లో ఉండడం వెంటిలేటర్లో ఉండడం కన్నా ఎంతో బెటర్ కదా
ఈ లాక్ డౌన్ విజయవంతం చేస్తే అందరం బాగుంటాము కదా!

Tuesday, March 3, 2020

!!అమ్మదే కులం!!

ఆమెను మీరే కులమని ఒక తెలివైన అబ్బాయి అడిగిన ప్రశ్నకు.. అమ్మగా చెప్పనా లేక అమ్మాయిగా చెప్పనాని పక్కున నవ్విందామె! అహా..ఆ రెంటిలోని ఆంతర్యమేమని ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టగా ఆమె చెప్పడం ప్రారంభించింది---- ఆత్మవిశ్వాసంతో మరో జన్మనెత్తి తల్లినైనప్పుడు "కులరహితనే" నేను!! తల్లిగా బిడ్డ మలమూత్రాలను శుభ్రపరిచినప్పుడు "శూద్ర" జాతి నాది.. శిశువుకు అన్నింటా రక్షణ కల్పించే ప్రక్రియలో "క్షత్రియ" కులం నాది.. పిల్లల్ని పెంచటంతోపాటు నాకులం కూడా మారిపోతుంది...అదెలాగంటావా! మంచి సంస్కృతి, విలువలు ప్రవర్తన నేర్పేటప్పుడు "బ్రాహ్మణ" జాతి నాది.. సంపాదనలో పొదుపు ఖర్చుల గురించి మార్గనిర్దేశం చేసే "వైశ్య" కులం నాది.. సమాధానం చదివి కూడా ఏ కులమని ఎవరైనా అడిగితే "అమ్మకు కులమే లేదంది" మరి మతాల పై మీ అభిప్రాయం ఏమిటన్నాడు ఆ అబ్బాయి.. "మతలబుతో బ్రతుకుతూ మట్టిలో కలిసే మనకు మతాల గురించి మాట్లాడే హక్కే లేదంది"

Thursday, February 27, 2020

!!ఉసిగొల్పు!!

జీవితంలో కొందరు మనతో ఉండి,మనతో పోరాడతారు
మోసం చేయాలని ముంచి తొక్కేస్తారు..
ఇతరులతో పోల్చి వెటకరించి అవమాన పరుస్తారు
ఎదుగుదలను ఓర్వలేక ద్రోహంచేస్తారు!!
వెన్నుపోటు పొడిచి నటిస్తూ తక్కువ చేసి మాట్లాడతారు
బలంకన్నా బలహీనతల గురించే చాటింపు వేస్తారు
జాలి చూపిస్తున్నట్లు ఉంటూ డబ్బుతో పోలుస్తారు
మనం నష్టపోతే సంతోషపడి డప్పుకొట్టి చాప్టర్ క్లోజ్ అంటారు
చేతకానిది ఎందుకు చేయాలి, అలా కావల్సిందే అంటారు
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు..
ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోతుంది
మనం వారి మాటలు విని అక్కడే ఆగితే గమ్యం చేరలేం!!
చావో..రేవో మనతో మన లక్ష్యం సాగాలి
వారి గురించి సమయం వృధా చేసి, ఆలోచించ కూడదు
మన ప్రయాణంలో వాళ్ళు గడ్డి పరకలతో సమానం
ఇలా ఎందరో వస్తారు పోతారు....మన ప్రయాణం మనదే!
ఎందుకంటే.."ఈ జీవితం మనది వారిది కాదు"

Wednesday, February 12, 2020

!!నాయిష్టం!!

నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెబుతాను
అందుకే పొగరుబోతులా కనబడతాను...
నన్ను నమ్మినవారిని ఎన్నడూ మోసగించను
అందుకే నేను చాలామందికి నచ్చను...
మనసులో కుళ్ళుంచుకుని పైకి నటించను
అందుకే అవసరానికి వాడుకుని వదిలేయబడతాను
ఎవరేమన్నా ఆత్మగౌరవంతో బ్రతికేస్తుంటాను
అందుకే అవాంతరాలు ఎన్నెదురైనా నవ్వేస్తుంటాను
నవ్వడం నవ్వించడం నా బలం బలహీనతా అయితే
నన్ను నన్నుగా ఆమోదించడం కాదనడం వారి విజ్ఞత!  

Saturday, February 1, 2020

కారులో...కారు చీకట్లో కైలాసవాసుని కాంచగ రారండి!



సత్యమే శివం...ఆ శివమే అతి సుందరం
స్వచ్ఛమైన మనసుని మించిన వెన్నెల్లేదు
కుళ్ళుకుతంత్రాలను మించిన చీకటిలేదు!

Tuesday, January 14, 2020

పండుగ శుభాకాంక్షలు



మనకు లభించిన దానితో తృప్తిపడి ఆనందాన్ని పొందగలగడమే నిజమైన భోగం మరియు అదే పరిపూర్ణమైన ఆనందం.
భోగి పండగ ద్వారా చాటబడే నీతి అదే.
చెప్పడం వ్రాయడం సులభమే...ఆచరణ కష్టమే!
అయినా ప్రయత్నిద్దాము...
మనకు లేనిది, మనది కానిది, నిన్నటి చేదును, మనలోని దురాశలను భోగి మంటల్లో వేసి, రాబోయే కాలానికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ...
భోగి-మకర సంక్రాంతి-కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు!