Monday, December 31, 2018

Saturday, December 8, 2018

!!ఏం తెలియలేదు!!

సమయం అలా గడుస్తూనే పోయింది..
ఎప్పుడు ఎలా గడిచిందో తెలియనేలేదు!
జీవితపు ఒడిదుడుకుల్లో ఎలా వచ్చిపోయింది
వయస్సు ఎలా కరిపోయిందో తెలియనేలేదు!

భుజాలపై ఎక్కి గెంతులువేసిన పిల్లలు..
ఎప్పుడు భుజాలు దాటి ఎదిగారో తెలియలేదు!
అద్దె ఇంటితో మొదలైన కాపురము
ఎప్పుడు సొంత ఇంటికి మారిందో తెలియలేదు!

సైకిల్ పై సాగించిన సరసాల సరదా సంసారం..
ఎప్పుడు కారులో కాపురం పెట్టిందో తెలియలేదు!
పిల్లలుగా బాధ్యతను ఎరిగి మసలిన మేము
ఎప్పుడు పిల్లలకి బాధ్యతయ్యామో తెలియనేలేదు!

ఉద్యోగం అంటూ ఊరూరా తిరిగి అలసి సొలసి..
ఎప్పుడు రిటైరయ్యే సమయం వచ్చిందో తెలియలేదు!
పిల్లల కోసం డబ్బు కూడబెట్టి ఆదా చెయ్యడంలో
ఎప్పుడు పిల్లలు దూరం అయ్యారో తెలియనేలేదు!

ఒకప్పుడు టైం దొరికితే కునుకు వేసేవాళ్ళం..
నిద్రని రాత్రులెప్పుడు దొంగిలించాయో తెలియలేదు!
నల్లని దట్టమైన జుట్టును చూసి మురిసిన మేం
తెల్లని పలుచబడ్డ మైదానం ఎప్పుడైందో తెలియలేదు!

కుటుంబమంతా కలిసి కిలకిలా నవ్వి తిరిగేవాళ్ళం..
విడివడి ఎప్పుడు ఇద్దరమే మిగిలామో తెలియలేదు!
ఇప్పుడు మాకోసమేదైనా చేసుకుందామని ఆలోచిస్తే
ఎప్పుడు శరీరం సహకరించడం మానిందో తెలియడంలేదు!

Wednesday, November 21, 2018

!!నిన్ను నీవు నమ్ముకో!!

నా జీవితంలోకి వచ్చి ఎవరి పాత్రలు వారు 
పరిపూర్ణంగానే పోషించి నిష్క్రమిస్తున్నారు..
నేను మాత్రం ఒంటరిగా పరిపూర్ణతకై ప్రయత్నించి 
గెలవక ఓడిన ప్రతీసారీ ప్రయత్నిస్తూనే ఉన్నాను! 
అదేం చిత్రమో కానీ అందరూ నిరుత్సాహ పడకు 
పడిలేచి మరింత ఉత్సాహంగా పరిగెత్తమంటున్నారు
ఇప్పటి వరకూ పరుగులెట్టి అలసిపోయిన నేను.. 
నాలుగడుగులే నడవలేక పోతుంటే ఏం పరిగెట్టను
గతించిన కాలం నాది కాదు ఈ కాలంతో నాకు పనిలేదు
ఎవరి పై ఆధారపడదామన్నా ఎవరి అత్యవసరాలు వారివి
అస్థిరత్వానికి అసలుసిసలైన ఆనవాళ్ళు వారి అవసరాలు!       
నన్ను నేను నమ్ముకుని ఓడిపోయినా బాధపడని మనసు 
వేరొకరిలో తనని తాను చూసి తృప్తి పడమని సలహా ఇస్తే
ఎందుకో ఏమో ఉక్రోషంతో చచ్చు సలహాలివ్వొదని అరవక..
ఏం చెయ్యాలో తెలియక వ్యధతో ఏడవలేక నవ్వుకుంటుంది!

Sunday, November 11, 2018

!!మంచిరోజు!!

తీరిక లేకుండా అప్పుడూ ఇప్పుడూ శ్రమిస్తున్నా 
అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ విసిగిపోతున్నా  
నావనుకున్న నా మంచిరోజులు ఎప్పుడు వచ్చేనో
ఇవి నా కవితాక్షరాలు కావు నా ఎదలోని వ్యధలు
భరించలేను అనుకున్నప్పుడంతా వ్రాసుకుంటున్నా!

కునుకు కరువైన కళ్ళలో కలలను నిదురపొమన్నా 
స్వప్నం సత్యం కాదని తెలిసి కూడా జోలపాడుతున్నా
నామనసు స్థిమితపడి తనువు ఎప్పుడు సేద తీరునో
కాలం గోరుల్లా పెరిగి నిరాశ గోరుచుట్టులా సలిపేస్తుంటే 
ఆశల నిమ్మకాయ తొడుగు గుచ్చి ఎన్నాళ్ళు ఉంచను!

బ్రతకడానికి ఏవో కొన్ని ఆశలు అవసరమని శ్రమిస్తూ 
నన్ను నేను నరుక్కుని ఎవరికి ఏ భాగమని పంచను!

Saturday, October 20, 2018

!!కాలం కసి!!


సర్దుకుంటూ గడిపిన సమయాన్ని సముదాయించి
సంధ్యాకాలం బడలిక వీడి సేదతీరాలి అనుకుంటాను
అంతలోనే అకస్మాత్తుగా ఎగసిపడే జ్ఞాపకాల సవ్వడులు
గుండెని ప్రతిధ్వనింప చేస్తూ పాతమాటల హోరులు..
కాలం మారిందంటూ వాస్తవాన్ని గుర్తుచేస్తుంటాయి! 

మనసు మాత్రం ఆ అనుభుతుల స్మరణలో బ్రతకమని
అబద్ధాన్ని నిజం చేయాలనే తాపత్రంతో తప్పు చేస్తూ
భవిష్యత్తుని భీమాగా చూపించి ఆశలు రేపుతుంటే
మనసుని విరిచి వేరుచేసే పరిస్థితులను కల్పించి..
కదిలే కాలం మాత్రం కనబడకనే కసితీర్చుకుంటుంది!

Thursday, October 18, 2018

!!ప్రతీ స్త్రీ ఒక శక్తి!!

Reincarnations of Goddess Shakti:
Shailputri
Brahmcharñi
Chandraghanta
Kushmanda
Skandamata
Katyayani
Kalratri
Mahagauri
Siddhidatri
May these nine manifestations of Shakti known as 
'Nava-Durga' bless you at all times!
May you experience blissful worshipping on Navratri!
WISHING YOU ALL HAPPY DUSSEHRA

Thursday, October 11, 2018

!!తాపత్రయం!!

నా ఈ అలంకారాలన్నీ ఒలిచివేసి లోకానికి..
నన్నునేనుగా కనిపించాలనుకున్నదే తడవు  
ఈదురుగాలిలో ఊకలా ఊహలన్నీ ఊగుతూ 
అవకాశాలు తారలై ఆకాశాన్ని తాకుతుంటే  
అనంతంలో బిందువైన నేను కడలిని చేరలేక 
కూపస్త మంఢూఖమై శిధిలమైపోతున్నాను!!

నన్ను ఆహా ఓహో అని పొగిడిన జనమే..
నా ఈ పతనాన్ని సంతోషంగా స్వాగతిస్తూ
పలుకరించడానికి వచ్చామని పరిహసిస్తుంటే
లోన గూడుకట్టుకున్న ప్రేమ మబ్బులా మారి
కుండపోతలా కన్నీరు కార్చి ఇక కురవలేక      
దిక్కులే నాకు దిక్కై తోచ సాగిపోతున్నాను!!

నాతోపాటు నా మరణం పుట్టిందని తెలియక.. 
ఇంకా ఏదో తాపత్రయంతో బ్రతుకుతున్నాను!! 

Thursday, July 26, 2018

!!జీవిత రణం!!

జీవన పయనంలో అనునిత్యం సంగ్రామమేనేమో 
తీరని కోర్కెలు కోరలు తెరచి బుసకొడుతున్నట్లు 
ఓపిక నశించి  రౌద్రం తాండవిస్తూ రణానికి సిద్ధం...

మాటా మాటా కలగలిసి కూడా క్షతగాత్రమైపోతూ
వయసేమో రెక్కలు తెగిన పక్షిలా అరుస్తున్నట్లు 
ఆత్మగౌరవపు గోడకతుక్కున్న సాంప్రదాయవ్యర్థం...

ఆవేదన ఆరాటంతో కరిగిపోతున్న ఆశయాల ఆకృతితో
ఆత్మాభిమానం అంచనాకందని భీభత్సం సృష్టిస్తూ
ముక్కలై రాలిపడిపోతున్న గతస్మృతుల యుద్ధం...

ముక్తాయింపులు మాట్లాడుకుంటున్న అనుబంధాల్లో
మనసుల మధ్య మమకార కారుణ్యం కరువైపోయినట్లు 
సివంగిలా పైకి నవ్వుతూ లోన దహిస్తున్న నా రూపం!!

Wednesday, July 4, 2018

!!మారిపోతున్నాను!!

రోజులు వారాలుగా వారాలు నెలలై ఏళ్ళు గడుస్తుంటే నేను ఎందుకు మారకూడదనుకుని మారిపోతున్నాను! అవును తల్లిదండ్రుల్ని అక్కాచెల్లెళ్ళను అన్నాతమ్ముల్ని నా అనుకున్న వారిని అందరినీ ప్రేమించి కళ్ళుతెరిచి ఎవరికెవరూ కారని నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను ఎవ్వరినీ మార్చలేక నన్ను నేను మార్చుకుంటున్నాను! ఇప్పుడు నేను కూరగాయలు పండ్లు అమ్ముకునే వారితో బేరసారాలు చేసి మిగిల్చిన సొమ్ముతో భవంతిని కట్టలేను ఆ సొమ్ము పేదవాడి పిల్ల స్కూల్ ఫీజ్ ఐతే బాగుండును ఆటోలో నుండి దిగి డబ్బులిచ్చి చిల్లరడగడం మానేసాను అదే చిల్లర డ్రైవర్ పెదవుల పై నవ్వైతే ఆనందిస్తున్నాను! నేనిప్పుడు ఒంటిపై బట్ట నలిగిపోయిందని బాధపడ్డంలేదు వ్యక్తిత్వమే మనకన్నా బిగ్గరగా మాట్లాడుతుందని తెలుసు ఎందరి చేతనో మెప్పులు ప్రశంసలు ప్రేరణగా పొందిన నేను స్వేచ్ఛగా ఉదారంగా నేనిప్పుడు ఎందరినో ప్రశంసిస్తున్నాను నాకు విలువనీయని వారి నుండి నేను దూరమైపోతున్నాను నా విలువ తెలియకపోయినా నేను వారిని తెలుసుకున్నాను! అవును నిజంగానే నాలో చాలా మార్పు వచ్చినట్లనిపిస్తుంది పనికిరాని ప్రసంగం చేయక కుళ్ళూ కుతంత్రాలని వెలివేసాను ఏ అనుబంధానికైనా అహమేగా అడ్డని పూర్తిగా అణచివేసాను నావలన జరిగిన తప్పుకి క్షమార్పణ కోరడం నేర్చుకున్నాను భావోద్వేగాలతో నేను ఇబ్బందిపడి వేరెవరినీ ఇబ్బంది పెట్టను నేను సృష్టించినవైన భావోద్వేగాలు నన్ను నిర్దేసిస్తే ఊరుకోను నా ప్రతీరోజు చివరిరోజనుకుని జీవించడం అలవరచుకున్నాను ప్రస్తుతానికి ఇంతే మారాను మున్ముందు ఎంతో మారిపోతాను!

Saturday, June 23, 2018

!!ప్రార్ధన!!

బ్రతుకు యుద్ధంలో గెలవలేక ఓడిపోతూ
నవ్వులు పెదవిపై అద్దుకుని సర్దుకుపోతూ
రోజూ చీకట్లో కళ్ళు తెరచి వెలుగు చూస్తూ
కలల పడవను ఎక్కి ఊహల్లో పయనిస్తూ  
ఉనికిని వెతుక్కునే ఆరాటంలో కొట్టుకుపోతూ
ఏం సాధించి ఎంత కూడబెట్టుకున్నానో తెలీదు! 

కానీ...ఎప్పటికప్పుడు కలతలని కడిగేస్తూ
కలవరాలని కడతేర్చి బ్రతుక్కి ఊపిరిపోస్తూ 
కొత్త ఆశల్ని మనసులో నింపుకుని సాగుతూ
జీవితపు చివరి మజిలీ వరకూ నిరీక్షిస్తూ 
ఆనందాలు కొన్నైనా నన్ను హత్తుకుంటాయని 
అడక్కనే అన్నీ ఇచ్చే అతీతశక్తిని వేడుకుంటాను!

Monday, June 11, 2018

!!సావాస దోషం!!

నేను చేస్తున్న వ్యాపారం ఏమిటని అడుగకు నేస్తం...
ప్రేమను అమ్మే దుకాణం తెరిచాను ధ్వేషమనే బజారులో  
ప్రేమను పంచినంత కాలం గంటలు క్షణాలుగా గడిచాయి
ప్రేమను ఆశించడం మొదలుపెట్టగానే క్షణమొక యుగమైంది!

జీవితం చాలా చౌకధరనే పలుకుతుంది చూడు నేస్తం...
కానీ జీవించడానికి ఎన్నుకున్న దారులే చాలా ఖరీదైనవి
దారులు ఎప్పుడూ వంకర పోకుండా తిన్నగానే ఉంటాయి
మలుపులు తిరిగి దారి మళ్ళిపోవడమే జీవితం అవుతుంది!   
    
నాకు నీకు ఉన్న సంబంధం ఏమిటని అడుగకు నేస్తం...
ఎన్నో నమ్మకాల పునాదిపై కట్టుకున్న బంధం నాది నీతో
కావలసింది ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాయి  
ఈ బంధం చేతికి పెట్టుకునే గోరింట తలకు పెట్టుకున్నప్పుడైంది!

మలుపు తిరగవలసి సమయంలో తిరక తప్పదు నేస్తం...
దాన్ని దారితప్పడం అనుకోవడం మూర్ఖత్వం అనుకుంటాను
మనసుకి గాయంచేసి మన్నించమనే మందు పూస్తున్నాయి 
నిజాలు చెప్పడం మొదలుపెట్టినాక మౌనమే మాట్లాడుతుంది!

Thursday, May 31, 2018

!!అస్తమించిన ఆశ!!

నన్ను నేను రాటుదేల్చుకుంటున్న కొద్దీ..
చావని ఆశలు రాచరికపు మర్యాదలు కోరుతూ
మదిని వేదనా రుసుము కట్టమని వేధిస్తున్నవి!

సున్నితత్వం బిడియపడలేనంటున్న కొద్దీ..
బింకం బిగుసుకుని బానిసత్వాన్ని పిలుస్తూ 
భస్తాల కొద్దీ దుఃఖాన్ని భుజాలపై మోయమని   
తనకేమీ వద్దంటూ భారీమూల్యం అడుగుతుంది!

ఆత్మాభిమానాన్ని కుదవుపెడుతున్న కొద్దీ..
నా అనిశ్చల అస్తిత్వం నన్ను అలుసు చేస్తూ
ఎదను కోసిన వారి పంచన చేరి ప్రశంసించమని
ప్రాధేయపడి జీవితాన్ని పణంగా పెట్టి పరిగెడుతూ 
జీవనగడియారపు ముల్లు ఆగేదాకా తిప్పుతుంది!

Saturday, May 12, 2018

!!వెన్నుపోటు!!

కొన్నాళ్ళుగా వెనుక వీపులో నొప్పిగా ఉంటుందని  
డాక్టర్ దగ్గరకెళితే వెన్నెముకల్లో ఎడమెక్కువైంది..
ఇకపై వంగి ఉండమాకు అంటూ సలహా ఇచ్చారు
మొదటిసారిగా ఒకరి నోటివెంట ఆ మాట వినగానే
తెలియకుండానే నవ్వూ ఏడుపూ కలిపి వచ్చాయి!

కలవరంతో కళ్ళు కలత ఆలోచనలని ప్రశ్నించాయి!   
చిన్నప్పటి నుండీ అమ్మా నాన్నా పెద్దలూ వృద్ధులూ 
సమాజం సైతం ఆడదానివి నువ్వు..వంగి ఉండమని
స్త్రీ..ఎంత వంగుంటే ఆ గృహమంత సవ్యంగా సాగేనంటే 
అలా వంగిపోయిన నాలోనూ వెన్నుపూస ఉందాని!?
ఇలా వంగి ఉన్నందుకే వెన్నుపోటూ, ఆ శూన్యతాని!      

ఇప్పుడు వంగొద్దంటే నన్నునేను ప్రశ్నించుకుంటున్నాను
బాల్యం నుంచీ అయిష్టాల్ని ఇష్టాలుగా మార్చుకున్నానని 
ఇప్పటికే ఎన్నో కోరికలు కలలూ జారిపోయాయి కదాని
జీవితం నన్ను ఇంకేం నిలబెట్టాలిలే అని సమాధానపడి
సర్దుకునిపోయి సాగవల్సిందే జీవితమని నవ్వుతున్నాను!

Wednesday, May 2, 2018

!!మార్పు!!

ఎవరో అన్నారు... 
రాణిలా బ్రతికిన నాలో రాజసం కరువాయెనని
నేను అన్నాను...
రాటుదేలింది నేనే కానీ రాతిగుండె నాది కాదని 
కొందరు అనుకుంటారు... 
నాలో మునపటి ఆ నవ్వూ కళాకాంతి తరిగెనని
నేను అనుకుంటున్నాను...
వయసుతో పాటు కళ తగ్గినా కరుణ తగ్గలేదని
ఓదార్పుకు మాటలెన్నో చెబుతారు...
సుఖదుఃఖాల్లో చివరి వరకూ తోడు ఉంటామని
నా అనుభవం చెబుతుంది...
ఎవరైనా సరే వారి అవసరం తీరే వరకే ఉంటారని
అందరికీ తెలుసు ఇది...
ఏం జరిగినా జరగక పోయినా జీవితం ఆగేది కాదని!  

Tuesday, May 1, 2018

!!విషెస్!!


కలతలను పెంచే కన్నీరు కూడా నిన్ను చూసి ధైర్యంతో నవ్వాలి!

అలజడులను రేపే ఆలోచనలన్నీ నిన్ను గమ్యానికి తీసుకువెళ్ళాలి!

అడుగు వేయక ఆపే అవరోధాలు ఆత్మవిశ్వాస సోపానాలు కావాలి!

తలచిన ప్రతీ కార్యంలో పట్టుదల నీతో ఉండి విజయభేరి మ్రోగించాలి!

ఆనందం ఉత్సాహం నిన్ను వీడక మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి!  

Thursday, April 19, 2018

!!వేషం మార్చి!!

నిర్వేదాన్ని నిర్విఘ్నంగా స్వాగతిస్తూ
నిస్సార నిర్లక్ష్య జీవితానుభూతిని 
పరమపద సోపానంగా పరుస్తూ
అంతర్మధనంతో అంతరాత్మని చంపి 
ఆలోచనల్లో ఆత్మానందానికి దూరమై 
వద్దంటూనే వాదించి వేదన కోరుకుని 
బంధాలకు అందకుండా జరిగిపోతూ 
బాధ్యతలేలని అనుబంధమే వద్దని
గిరి గీసుకుని ఒంటరిగా బ్రతికేస్తూ
గల్లంతైన గుండె కోసం వెతుకుతూ
ముఖం పై ముడతలకి ఆతిధ్యమిచ్చి 
చిరునామా లేని చితిని పేర్చుకుని 
గమ్యంలేని పయనమై సాగిపోతాను!!

Tuesday, April 17, 2018

!!శిక్ష!!

కోరికల ఘర్షణలో మదిపడే సంఘర్షణ
మంచీ చెడులను తూకం వేసుకుంటూ 
జీవితాంభుధి అలల్లో కొట్టుమిట్టాడుతూ 
నన్ను నేను కాపాడుకునే ప్రక్రియలో 
నా కర్మలపై సంగ్రామం చేయడం రాక
నాకు నేనే వేసుకోవాలనుకున్న శిక్ష.. 

జీవితం బాధల ఊబని తెలిసి కూడా  
నా అనుకున్నవారు పరాయని తెలిసినా  
అన్నీ నేనై ఉండాలని తాపత్రయ పడ్డం
మమకారం పెంచేసుకుని పెనుగులాడ్డం 
ఏం కానని తెలిసినా ఏదో ఆశ చావక 
అల్లుకున్న బంధాన్ని హత్య చేయలేక
నన్నునే వెలేసుకుని విధించుకున్న శిక్ష!  

Friday, March 16, 2018

!!అనిశ్చల బాట!!

నేనూ అస్తమిస్తున్న సూర్యుడూ ఒకటేనని అంతరాత్మ అప్పుడప్పుడూ హెచ్చరిస్తున్నా ఆశ చావని ఆత్మస్థైర్యం ఓటమిని ఒప్పుకోదు సరికదా...మరునాడు మరలా ఉదయించే సూర్యుడే ఆదర్శమని ప్రయత్నం ఆపవద్దంటూ బ్రతకడానికి మరో బాటవైపు పయనం తప్పదని నీరుకారిపోతున్న ఉత్సాహానికి ఊరటనిస్తూ... లేని చైతన్యాన్ని ఉసిగొల్పి తమాషా చూస్తుంది ఇదేం తెలియని సమయం ఆగక పరుగెడుతుంటే జీవితం తన పని తాను చేసుకుపోతూనే ఉంది సూర్యుడు అస్తమిస్తూ ఉదయిస్తూ అస్తమిస్తున్నాడు నా ఆయువు మాత్రం అస్తమం వైపు పయనిస్తుంది!

Tuesday, February 27, 2018

!!పెళ్ళి-పెటాకులు!!

ప్రేమా ప్రేమాని ప్రేమకోసం ప్రాకులాడి
ఎవరినో ప్రేమిస్తే ఒరిగేదేం ఉండదని..
నన్ను నేను ప్రేమించుకుంటున్నాను!

అన్నీ తెలుసు అనుకుని అజ్ఞానంతో
పరులను పరిహసించడం పాపమని..
నా అవగాహనని పరిహసించుకున్నాను!

అవివేకినై ఎవరిలోనో ఆశయాలు వెతికి
అబాసుపాలై ఆవేదన చెందడం ఏలని..
కలలతో కావలసినంత శృంగారం చేసాను!

ఢాబూ దర్పం దర్జాలకై శ్రమించడం రాక
నీడతోనూ నిరాశ ఎదురై అత్యాశేనని..  
సాధారణ సరళతను కౌగిలించుకున్నాను!

అనవసరంగా ఏవో ఊహించి ఊహల్లో తేలి
అవినీతిని ఆశ్రయించని నిస్సహాయతని తిట్టి
నిజాయితీని పెళ్ళాడి అహానికి విడాకులు ఇచ్చాను! 

Thursday, February 22, 2018

!!గురివింద గింజలు!!

మాటలు చెప్పడానికీ చెయ్యడానికి చాలా తేడా ఉంటుంది
వేసిన ముగ్గుకి వంకలు పెట్టడం ఈజీ వెయ్యడమే కష్టం!!
         కొడుకు US లో,కూతురు ఆస్ట్రేలియాలో, చేతిలో నెలకు 50 వేలు వచ్చే ఉద్యోగముంటుంది
హైద్రాబాద్లో నెలకు 60 వేల రెంటొచ్చే అపార్టుమెంట్లు ఉంటాయి.
అయినా సర్పంచ్ మనోడేనని తెల్లకార్డు తీసుకుని, MLA తెలిసినోడని ఇందిరమ్మ ఇల్లు రాయించుకుని...
ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ లు చేయించుకుని...
నీరవ్ మోడీ ముచ్చట టీవీలో వినబడగానే...రివ్వున లేచి వీళ్లంతా దొంగలండీ అని ముచ్చట చెబుతారు.
పక్కింటి వెంకట్రావ్ కొడుకు మునిసిపల్ ఆఫీసులో పనిచేసి వంద కోట్ల ఆస్తులు కూడబెట్టింది తెలుసు
ఇంటి వెనుక టీచర్ ఏ రోజు బడికెళ్ళకుండా చిట్టీల వ్యాపారం పెట్టి బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టుకున్నది తెలుసు
చిన్నకొడుకు కరెంట్ ఆఫీసులో పనిచేస్తూ 50 కోట్లు వెనకేసింది తెలుసు
అల్లుడు బ్యాంకులో పనిచేస్తూ దొంగనోట్లు ఇప్పించి కమిషన్ లతో లెక్కలేనన్ని ప్లాట్లు సంపాదించింది తెలుసు
అయినా సందు దొరికితే చాలు వెనుకా ముందు చూడకుండా నొక్కెయ్యడం...
ఏం ఎరగనట్టు సుత్తపూసల్లా ముచ్చట్లు చెప్పడం!
అవినీతి నీ ఇంట్లో, నా ఇంట్లో, పక్కింట్లో ఏరులై పారుతుంది
ఎదుటోడికి కనపడకుండా తుడుచుకుని కొందరు చూస్తే చూసారు ఏం చేస్తారని ఇంకొందరు..అంతే తేడా!
అడుగంటి పోయింది నీటిచుక్కొక్కటే కాదు నీతి నిజాయితీలు!
వాననీళ్లతో బోర్లేసుకుని, బొక్కల్లో నీళ్లు నింపుకుని...
నేల లోపలి పొరల్లో నీటి జాడను పెంచుకున్నట్టు...
మొట్టమొదటిసారి బడికి వెళ్లే పిల్లల దగ్గరి నుండి నీతి నిజాయితీల పునాదులను గట్టిచేసుకోవాల్సిందే
బ్యాంకు కుంభకోణమైనా...పెన్నుల కంపెనీ అవినీతి అయినా...గడ్డి మోపుల లెక్కైనా...
నువ్వో నేనో వాడో వీడో చెయ్యి అందిస్తేనే అవుతుంది
పైన ఉన్నోడు నిజం చెబితే పై నుండి క్రిందిదాకా మనవే పేర్లుంటాయి!
మొన్న ఒకరు విజయ్ మాల్యా + నీరవ్ మోడీ 120..కోట్లమంది= 185..రూపాయలని ఒక లెక్క చెప్పారు.
ఇది ఖచ్చితంగా తప్పే నియమాలను కఠినం చెయ్యాల్సిందే తప్పులను అరికట్టాల్సిందే..
ఇంకో లెక్క-ఒక ఇంట్లోంచి ఒక సంవత్సరానికి 1000..రూపాయల అవినీతిX100,00,00,000=ఎన్ని వేల కోట్లు?
మరి దీనిని ఆపటం ఎలా???
"గురివింద గింజలాంటి వారు గు** క్రింద నలుపు చూసుకోవాలి కదా"

Thursday, February 8, 2018

!!ప్రయాసాప్రయత్నం!!

బ్రతికినంతకాలం కుదురుగా ఉండాలని 
సరైన ప్రణాలికలే వేసానని సంతోషించి   
సంసార సముద్రంలోని సారాన్ని వెతికి 
సవ్యంగా తీరం చేరాలని ప్రయత్నించకు!

జీవితనౌకని తెగింపు తెడ్డుతో నడుపుతూ 
అంతరంగ ఆలోచనలకి ఆనకట్టలే వేసినా 
ఈతకొట్టి అలసట తప్ప అంతముండదు
బ్రతుకు తీపి బంధాలకు హద్దులుండవు!

బ్రతుకు భారం దింపుకునే ఉబలాటంలో
ఉత్సాహం అరువు తెచ్చుకుని బెంగపడి  
అనవసరమైన అనుభవాలకు విలువనిచ్చి  
భాధ్యతలను పెంచేసుకుని బెంబేలుపడకు!    

అస్థిరమైన మంచీచెడ్ల కాలాలని బంధించి 
కుడుటపడని మనసును ఇబ్బంది పెడుతూ 
విచారాలకు వేదనల్ని వలువలుగా చుట్టినా  
కష్టాల కన్నీళ్ళు ఎన్ని కార్చినా ఫలించవు!

Thursday, January 25, 2018

!!దమ్ము!!

దాసోహమై వంగి దణ్ణాలెట్టి దేహీ అంటే 
ధీనంగా చూసి కుక్కలా ఛీకొట్టే లోకం..
అన్నింటా ధీరులై దర్జా ధీమాలతో ఉంటే
సింహమని శిరస్సు వంచి సలాం చేస్తుంది!

ధరించిన వస్త్రాల్లో దాగిలేదు దమ్ము అనేది
మనపై మనకున్న నమ్మకమే మన బలం..
వేసుకున్న వస్త్రాలనిబట్టి హోదా పెరిగేటట్లైతే
తెల్లని గుడ్డలో చుట్టబడ్డ శవం కూడా లేచి 
సింహాసనం పై కూర్చుని చిందులువేస్తుంది!

Tuesday, January 23, 2018

!!సద్వినియోగం!!

సాధించాలన్న దీక్ష పట్టుదల ఉన్నవాళ్ళు..ఆలస్యంగానైనా అనుకున్నది సాధించి చూపిస్తారు.. అంతేకానీ వంకలు పట్టుకుని వేలాడరు! మనం వేసిన ముగ్గు చెరిగిపోతే కొంచెం శ్రమపడితే.. దానికి మించింది మరోటి వేసుకోవచ్చు! మనకంటే బెటర్ అనుకుని మనల్ని వదిలేసి వెళ్ళినవాళ్ళు అంతకంటే బెటర్ అనిపిస్తే.. వాళ్ళనీ వదిలేసి వెళ్ళిపోతారు! అంతే కాదు వాళ్ళకంటే బెస్ట్ వాళ్ళని ఎంచుకునే అవకాశాన్ని.. మనకి వాళ్ళే ఇచ్చి మరీ వెళ్తారు! తెలిసిన వారు అవకాశాన్ని వాడుకుంటే తెలియవారు తెలివిలేక.. సద్వినియోగం చేసుకోవడం రాక ఏడుస్తారు!

Sunday, January 14, 2018

!!పండుగ శుభాకాంక్షలు!!

అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు  
భోగిమంటల్లో పీడలన్నీ మాయం 
సంక్రాంతి తీసుకురావాలి సంతోషం
కనుమ తీర్చాలి అందరి అభీష్టం   
మనదేశం కావాలి శాంతి నిలయం!

Thursday, January 11, 2018

!!ఎవరికి వారు!!


ప్రతీ సాగరానికి రెండు తీరాలు ఉన్నట్లుగా..
ప్రతీ మనిషికీ రెండు నాలుకలు ఉంటాయేమో
లోన ఒకటనుకుని పైకి ఒకటి మాట్లాడతారు!

మనసుకి నచ్చినవారు మనతో లేకపోతేనేం..
జ్ఞాపకాల్లో మనతో కలసి మెదులు తుంటారు!

జీవితాంతం ఎవరోకరు తోడుండాలని ఆశించకు..
ఎవరైన ఒంటరిగా ఉన్నప్పుడే తలుచుకుంటారు!

Sunday, January 7, 2018

!!మార్పు!!

నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను.. నా గురించి చర్చించుకుంటున్నారంటే చెడుగా నాపై చెప్పుకుంటే మాత్రం ఏం నన్ను తలచుకుంటున్నారని అనుకుంటాను! ఎవరన్నారు "నేచర్" మరియు "సిగ్నేచర్" ఎప్పుడూ మారవు మరియూ మార్చలేమని!? చేతివేళ్ళకి గాయమైతే సిగ్నేచర్ మారుతుంది మనసుకి గాయమైతే మనిషి నేచర్ మారుతుంది.