Sunday, December 25, 2016

!!స్వయంకృతం!!

జీవితమా..నీవు కన్నీరుగా మారి ప్రవహిస్తున్నావు
మేము నవ్వుతూ జీవించాలని ప్రయత్నిస్తున్నాము
కళ్ళజోడులో నుండి లోకాన్ని మా రీతిలో చూస్తూ
మాకు అనుకూలంగా అమరితే ఓహో అనుకుని..
అమరకుంటే వ్యర్థమని అవతల విసిరివేస్తున్నాము!
మేము అనుభవించని బాధ ఎదుటి వారికి కలిగితే
వ్యధలతో బాధపడుతున్న వారిని నిర్ధారిస్తున్నాము!
నిజం చెబితే ఉన్న బంధాలు విచ్ఛిన్నం అవుతాయని
అబద్ధాలు చెప్పి మానుంచి మేమే దూరమౌతున్నాము!
నిన్న ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడి దూరంగా జరిగి 
నేడు మా గుండెకు మేమే లంచమిచ్చి బంధీలైనాము!

Monday, November 21, 2016

Sunday, November 13, 2016

!!ప్రయత్నించు!!

లేడిలా లేచి పరిగెత్త లేనని
ఆలోచించి ఆవేదన చెందకు
చేతకావడంలేదన్న చింతతో  
నీ ఆశయాలకు కళ్ళెం వేయకు
తాత్కాలిక ఒడిదుడుకులకు లొంగి
శాశ్వత సంతోషాల్ని తృంచివేయకు
జీవితంలో పడిలేచి పరుగిడక తప్పదు   
అయిన గాయాలు మానితే గెంతులేస్తావు
ప్రయత్నించకుండా ఫలితాన్ని పొందలేవు
ధృఢనిశ్చయంతో దేన్నైనా సాధిస్తావు!

Thursday, November 10, 2016

!!విలువ!!

 చిరు జీవితంలో చిన్నగా ఊహించి చేసేది కొంచెం
ఉన్నతంగా ఊహిస్తేనే మనకొచ్చేను లాభం...
నిన్న చేయిజారి క్రిందపడితే కళ్ళకద్దుకున్న
పెద్ద నోట్లే నేడు పల్లీ పొట్లాలుగా
పాత సామాన్లా వేయాలంటూ
వ్యాఖ్యలు వ్యంగంగా మాటలు!
ఇలాగే మనిషి రూపం బయటపడేది...
నిన్న రంగు కాగితానికి లొంగిపోయి
విలువ లేదంటే నేడు అవహేళనలు
విలువ పోయే వెయ్యి నోటుకు కాదు
మనిషి నోటికి మానవతా విలువలకి!

Sunday, November 6, 2016

!!నేను!!

ఎద నిండుగా కోరికలున్న నన్ను
కాలమా క్షణక్షణం ఏల పరీక్షిస్తావు?
నేను స్థిరంగా ఉండే సాగరాన్ని కాను..
ఓర్పుతో నదుల్ని నాలో కలుపుకోడానికి
సహనంతో సాధించనిది సంగ్రహించడానికి!  
వ్యధల్ని వధించే ధీరురాల్ని అసలే కాను..
గెలుపోటమిలా వచ్చిపోతాయని నవ్వడానికి
అన్నీ అశాశ్వితమని వేదాలు వల్లించడానికి!
రాయినో రప్పనో అంతకన్నా కాను..   
భావోధ్వేగాలు నన్ను తాకవని సర్దుకోడానికి
కభోధినై కన్నకలల్ని కట్టిపడేసి జీవించడానికి!

Wednesday, October 26, 2016

!!విభిన్నం!!

పెట్టెలో ఉంటే అగ్గిపుల్లలన్నీ ఒకేటేలా ఉంటాయి
కొన్ని దీపాలని వెలిగిస్తే కొన్ని కొంపల్ని కాల్చేను

కొన్ని అగరవత్తుల్ని వెలిగించి పరిమళాన్ని అందిస్తే
మరికొన్ని పొగవదిలే సిగరెట్లని అంటించి మురిసేను

కొన్ని పొయ్యిలో నిప్పై వెలిగి కడుపు ఆకలిని తీర్చ
మరికొన్ని కసి కాంక్షలై కడుపుమంట మిగిల్చేను

కొన్ని చలిమంటగా రాచుకుని బీదవాన్ని రక్షించగా
మరికొన్ని చితికి నిప్పుపెట్టి చిద్విలాసం చూపించేను

మొక్కలన్నీ పచ్చగా చూడ్డానికి ఒకేలా బాగుంటాయి
కొన్ని కలుపు మొక్కలై రాలితే కొన్ని కల్పవృక్షాలౌను

కొన్ని గాలినిచ్చి మరికొన్ని ఆహారమై ప్రాణాలు నిలుప
మరికొన్ని నీడనిచ్చే చెట్లై కొన్ని ఔషధాలై కాపాడును

మనుషులు జన్మించడం రక్తం రంగు ఒకటే అయినా
వారివారి ప్రవర్తనానుసారం చూపిస్తారు లోకం రంగును!!

Monday, October 17, 2016

!!గుర్తింపు!!


పండిన పండుని మెత్తగా తీయగా
మారిన రంగునిబట్టి గుర్తించినట్లే...
నమ్రతతో కూడిన సున్నితత్వం, 
మాటల్లో తీయదనం మరియు 
ఆత్మవిశ్వాసంతో కూడిన ముఖవర్చస్సునిబట్టి 
పరిపక్వం చెందిన మనిషిని గుర్తించవచ్చు...
పువ్వు ఎంత అందంగా ఉంటేనేమి
పరిమళాన్నిబట్టే పువ్వులకి నిగారింపు
మనిషి ఎంత గొప్ప వాడైతేనేమి
గుణం మంచితనాన్నిబట్టే వారికి గుర్తింపు!!

Saturday, October 8, 2016

!!నా దారి!!

నన్నునే ప్రేమించుకుని లోకాన్ని చూడబోతే
లోకంలో ధ్వేషించడానికి మనిషే కరువైనాడు
బాధలని లెక్కచేయక వదిలి నవ్వుతూ తిరిగితే
సంతోషాలే చంకలెగరేసి వచ్చి చుట్టుకునె చూడు
ఓటమిని ఒగ్గేయక కొత్తమార్గంలో పయనించబోతే
పనికిరాని ప్రయత్నమని నవ్వి గేలి చేసె నాడు
నన్ను నేనే నమ్ముకుని పలుమార్లు ప్రయత్నిస్తే
విజయమే వెతుక్కుంటూ వచ్చి చేరు ఒకనాడు
నా లక్ష్యం మంచిదని తెలుసుకుని నేను నడిస్తే
ఎత్తునున్న నన్ను చూడ జనం తలెత్తెదరు ఆనాడు!

Monday, October 3, 2016

!!జీవితం!!

జీవితం ఏమిటన్న జిజ్ఞాసతో 
ఆలోచిస్తూ సమయం వృధా చేయకు
కాస్త కష్టపడి కులాసాగా జీవించు
జీవితం పూర్తిగా అదే అర్థమౌతుంది!!

జీవితంలో నాలుగు వేదాలు 
అర్థం కాకపోయినా పర్వాలేదు 
కానీ..
చిత్తశుద్ధి, బాధ్యత, నిజాయితీ, హేతుబద్ధత
ఈ నాలుగు వాక్యాల మర్మమెరిగి మసలుకో
జీవితానికి సార్ధకత చేకూరుతుంది!! 

Tuesday, September 20, 2016

!!ధీరుడా సలాం!!

వీరులారా మీ ప్రయత్నం కొనసాగనివ్వండి
మీ విలువ పెరుగునే కాని తరుగదు ఎన్నటికీ
మీ ఆత్మస్థైర్యమే మీ బలం బలగం
వాటితో మీరు జవాబు ఇచ్చిరండి...
వెన్నుపోటు పొడవడం వీరోచితం కాదు
బాధపెట్టి హింసించడం వీరత్వమూ కాదు!
నలుగుర్ని నిశ్చింతగా నిదురపోనిచ్చేవాడే
నిజమైన ధీరుడు శూరుడు...
జవానుల్లారా మీ వల్ల మేము నిశ్చింతగున్నాం
మీరే మా హీరోలు నిజంగానే మీరు వీరులు!
మీరు అలసటని ఆహ్వానించక పోరాడండి
చేరాల్సిన గమ్యం దూరంగుంది తెలుసుకోండి
పోరాడే పాండవులు ఐదుగురే ఎప్పుడూ
అప్పటివలే నడిపించే సారధే కరువైనాడు నేడు
కౌరవులు మాత్రం వేలల్లో ఉన్నారు చిత్తుచేయండి!

Sunday, September 18, 2016

!!నీవొక ప్రశ్న!!

నాకొక జవాబులేని ప్రశ్నవు నీవు...ఓ మనసా!
నా ఆలోచనలతో కలిసి అడుగు వేస్తావనుకుంటే 
నా అడుగులకు అడ్డొచ్చి అడ్డగిస్తావు ఎందుకనో
నిన్ను నమ్ముకుని నీదారి వెంట నే నడువబోవ
అటుఇటు కాని ఆశల్ని నాలో ఉసిగొల్పి నవ్వేవు
కాలం కలిసి వచ్చునులే వేచి ఉందామనుకుంటే 
కాలం మనతో కాదు కాలంతో మనమాడుకోవాలని
లేని పోని సూక్తుల్ని చెవిలోన ఊది జారుకుంటావు
అనుకున్నవి అన్నీ జరుగవులే అనుకుని దిటవుతో  
నిన్ను వీడి మెదడుతో మచ్చిక చేసుకుని కదలబోవ   
గతం జ్ఞప్తికని మెల్లగా మెదడునే చెదలా దొలిచేస్తూ..
మనసు మంచిదైతే చాలని నీతి చెప్పనేల ఓ మనసా?

Sunday, September 11, 2016

!!బంధం!!

పత్ని మనసులో వెతికి చూడు
నీ ఊహల్లోని ప్రియురాలు కనిపించు
కూతురితో కులాసా కబుర్లు చెప్పు
గతించిన యవ్వనం జ్ఞాపకం వచ్చును
నీ మొదటి స్నేహాన్ని గుర్తు చేసుకో
అమ్మ ముఖం నీ ముందు కదలాడేను
వృధ్ధుడైన నాన్నతో మాట్లాడి చూడు
సలహాలిచ్చే ఆప్తమిత్రుడే అగుపించు
మిత్రుల్లో బంధాలు ఏం వెతుకుతావు
ఉన్న బంధాల్లో స్నేహితుల్ని వెతుకు
జీవితమే స్నేహమయం అనిపించు!!

Wednesday, September 7, 2016

Monday, August 29, 2016

!!చేసి చూపు!!

కంటితో చూసి బొమ్మల్ని ఆనందించగలం

చిత్రాల్ని చేతితో దిద్ది చిత్రకారులం కాలేము

ఎదుటివారి ఉన్నతిని చూసి ఈర్ష్య పడతాం

`లేదా మెచ్చుకుని సంబరపడగలమే కానీ...

కేవలం కబుర్లు చెబితే ఆ స్థాయిని చేరుకోము

నీడే తోడు ఉందని లోకాన్ని వీడి బ్రతుకలేం

ప్రయత్నించకనే ఫలితం దక్కలేదంటూ...

వాపోయి విధి వక్రమంటూ నిందించలేము

ధీక్ష కృషి పట్టుదల వంటి పెట్టుబడులు లేక

చేసే ఏ పనిలోనైనా విజయం సాధించలేం!

Tuesday, August 23, 2016

!!మనం!!

మనము ఎలాగో అలాగే ఉంటాం..

మన బంధాలూ అలాగే ఉంటాయి

మన దారి కూడా అలాగే ఉంటుంది!!

మారిపోయేవి మాత్రం...

సమయం, సహనం, సంబంధాలు

వాటితో పాటు ఆలోచనలు ఆచరణలు!

ముఖం చూసి మనసు చదివే విద్య

నేర్చుకోవాలన్న తపన తట్టిలేపుతుంది!

ముఖం పై పుస్తకాల్లో ఉన్న దానికన్నా

ఎక్కువ లిఖించబడి ఉంటుందన్న ఆలోచనేమో!!

Saturday, August 20, 2016

!!గుర్తింపు!!

నా అనేక వైఫల్యాలను ప్రక్కకు త్రోసి

నన్ను ఉన్నతస్థాయిలో ఊహించి

నన్ను నన్నుగా ఇష్టాపడే వారిలో...

నాకు కనిపించేది పరమాత్ముడే తప్ప

ఈర్ష్య ధ్వేషాలతో రగిలే మనిషి కాదు!!

Sunday, June 26, 2016

!!వృధ్ధపరువం!!

అరంగేట్రం చేసిన ఆశలు అణచుకోవాలి అనుకునే కొద్దీ
అణగలేమని అంటూ హాస్యం చేసి ఆట పట్టిస్తున్నాయి!

వయసు పైబడి పెంచుకున్న కోరికల్లోని ప్రోత్సాహం తగ్గి
నీరసం కౌగిలంటే జీవితోత్సాహాలు సన్నగిల్లుతున్నాయి!

పంటి క్రిందవేసి పట్టుదారాన్నే కొరకలేని వృధ్ధపరువానికి
పనిలేని పరిపక్వాలు తోడున్నామంటూ పిలుస్తున్నాయి!

యవ్వనంలో తీరకుండా బోల్తాపడ్డ పసిడికలలు నిద్రలేచి
అరిగిన ఆలోచన్లకి ఆకురాయితో పదును పెడుతున్నాయి!

పరుగు తీయాల్సిన ప్రాయంలో పట్టనట్లు పడుకున్న ప్రేమ
ఇప్పుడు ప్రాకులాటతో గుండెలయల్ని వేగం చేస్తున్నాయి!

ముగ్ధమనోహరమైన మోముపై రంగులు మెరవలేక వెలసి
నిద్రపోతే జ్ఞాపకాలు జోలపాటంటూ భయపెడుతున్నాయి!

అమాయకపు హృదయం పసిపిల్లలా గెంతులువేయాలని
చేసే ప్రయత్నాలు ప్రయాసపడి లేస్తూ కుంటుతున్నాయి!

Monday, June 20, 2016

!!డామిట్ అడ్డం!!

డామిట్...విచిత్ర విన్యాసమదేమో మోహానిది మమతది
నిర్మల నిశ్చింతలని కోరుకుంటాము ముళ్ళై గుచ్చుకుంటే!

దక్కిందేదో మిగిలిందేదోనన్న ఆలోచనలే దండుగ ఏమో
వచ్చిపోయే సుఖధుఃఖపు వెలుగునీడల దాగుడుమూతల్లో!

కనులారా చూడలేదు కొలువనే లేదు భగవంతుని మదిలో
అయినా నా పై నేను వశము తప్పుతాను నిదురపోతుంటే!

జనం నవ్వుని ఆనందపు అందలాన్న ఎక్కించి ఊరేగిస్తారు
కానీ...వాస్తవానికి వగచి ఊరట పడితేనే కదా ఉపశమనం!

Wednesday, June 15, 2016

!!ఆశలు!!

ఆనందం ఎక్కడా అమ్ముడుకాదు  
ఆవేదనా మనకోసం అమ్మబడదు
ఆలోచనల్లో అవకతవకలనుకుంటా
వాటికి మందుమాకులేం ఉండవు!

కోరికలతో కొట్టుమిట్టాడు మనిషిని
మూర్ఖత్వం కౌగిలించుకుని వీడదు
సరిదిద్ది సంధి చేసుకోవాలనుకుంటే
ఆపసోపాలతో అగచాట్లపాలయ్యేవు!

ఆశలకి లొంగితే నీకు నీవే పిడిబాకు
మితిమీరితే జీవితంపై పుట్టు చిరాకు  
ఆకాంక్షలు అంతంలో చేసేను గాయం
అయినా జీవితాంతం మనల్ని వీడవు!


Saturday, June 11, 2016

!!వేచి ఉండండి!!

సూర్యుడు ఇంకా సద్దుమణగలేదు
 
పచ్చని చెట్లు ఆకులు రాల్చలేదు
 
కాస్తాగి...ఓపికతో వేచి ఉండండి
 
ఓటమి నన్ను ఇంకా వరించలేదు
 
కాస్తంత ప్రయత్నం చేయనివ్వండి
 
ఓడిపోతే నేనే తిరిగి పయనమైపోతాను
 
పోరాటం ఏదో పూర్తి కానివ్వండి
 
విరూపించ వంకలు అవసరంలేదు
 
త్వరలో ఎలాగో పరాభవించబడతాను 
 
కొద్దిగా పేరుప్రతిష్టలు ఏవో రానివ్వండి!!

Thursday, June 2, 2016

!!ప్రేమ కాని ప్రేమ!!

నాకు ప్రేమికులెప్పుడూ ఎందుకనో అర్థంకారు

అసలైన ప్రేమ వీరిది అనుకుందామంటే

అమ్మ చూపిందేంటని ఆశ్చర్యం నవ్వింది.. 

ఒకరికొకరు ఇరువురి బంధమనుకుంటే

కన్నవారి ప్రేమ కాలకూట విషమా అనంది..   

ఇద్దరి మనసులు ఒకటైనాయి అనంటే

జన్మ ఇవ్వకపోతే అంటూ అపహాస్యమాడింది..

ప్రేమకు పరిభాష వెతక్క పెద్దమనసుతో పయనిస్తుంటే

పెంచిన పాశం పసిపాపై మేనుని, మెదడుని దొలిచింది!

Monday, May 16, 2016

!!నవ్వేసేయ్!!



నవ్వుతూ నాలుగు ముక్కలు చెప్పేసేయ్
కొన్ని మాటలు నిన్నుకాదనుకుని నవ్వేసేయ్
అన్నిటికీ అనుకుని ఆలోచిస్తే సమస్యలే చుట్టూ
లాక్కుని పీక్కుంటే బుర్రలో గుజ్జుకే చెదలు పట్టు..

కొన్ని నిర్ణయాలు నీవికావని కాలానికి వదిలేసేయ్
రేపెలా ఉంటుందో ఏమో అనుకుని నేడు నవ్వేసేయ్
అప్పుడప్పుడూ సరదాగా సర్దుకుని పోతుండూ
ఎందుకంటే కాయలున్న చెట్టే ఒదిగిపోయి ఉండు..

నీకు నచ్చనివి జరిగినా బయటపడక దాచేసేయ్
కొన్ని నీవికావనుకుని బాధించినా అలగక నవ్వేసేయ్
తప్పులనుకుంటే అన్నీ గుండెను కోసి గాయం చేస్తాయి
అనిశ్చల జీవితానికవి అనవసరం అనుకుంటే హాయి..

Saturday, May 14, 2016

!!సహజంగా!!

సముద్రమే సహజసిద్ధంగా సారాయి అయితే ఎంత బాగో..
కలలు అన్నీ నిజాలు అయితే అబ్బో ఎంత ఖుషీ ఖుషీనో!

ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవరి తరంలే..
అందరి గుండెలు పారదర్శకమై అగుపిస్తే అబ్బో ఆహా ఓహో!

మౌనానికే మాటరాక మనుషుల మధ్య సంధి అయినదేమో..
ముఖం ముందే ఉన్నది ఉన్నట్లు చెబితే ఎంత రచ్చ రచ్చనో!

ఎప్పుడూ మంచి చేసి చెడు అనిపించుకుంటాను ఎందుకో..
అదేదో సహజంగానే చెడ్డదాన్ని అయ్యుంటే ఎంత బాగుండేదో!

కాలం కలసి వస్తే చేసేది వక్రమైనా అందరికీ వింత విచిత్రమే..
పగబడితే ఆకు కూడా ఆయుధమై ఆయువే తీసేను తెలుసుకో!

Friday, May 6, 2016

!!నా నవ్వు!!

కొన్నిసార్లు నవ్వాలనుకుంటూనే కన్నీళ్ళు కారుస్తుంటాను
కొన్ని నీటిచుక్కలు కంట్లోమొలకెత్తి నన్ను వెక్కిరిస్తున్నట్లు
మరికొన్ని వద్దన్నా గుండెచలమల్లో చేరి నివాసముంటాయి!

కొన్నిసార్లు కన్నీళ్ళే నాకు కడుప్రియమైన భావాలనుకుంటాను
దరిచేరిన వాటిని ఆలింగనం చేసుకోవాలని ఆహ్వానించబోతూనే
మనసుగది గోడకి ధుఃఖపుధూళి మరింతగా వచ్చి అంటుతాయి!

కొన్నిసార్లు ఆలోచన్లు అనిశ్చితాలని సర్దుకోబోయి సంధి అంటాను
అదే అలుసై గాయాలన్నీ ఘనీభవించి సూదుల్లా పొడిచి దొలుస్తూ
రాత్రంతా జాగారముంచి పగలు ముఖంపై నల్లచారికలై నర్తిస్తాయి!

కొన్నిసార్లు అక్షరాలుగా మార్చి గుర్తులకి ఒకరూపు ఇవ్వబోతాను
బరువెక్కిన మనసు కవనమై తెరచిన జ్ఞాపకాలుగా పొంగిపొర్లుతూ 
నుదుటిపై ముడతలై నాట్యం చేయబోయి నివాసమౌతానంటాయి!

కొన్నిసార్లు కన్నీళ్ళు ఏమైనా కొత్తచుట్టాలాని తనివితీరా ఏడుస్తాను
అప్పుడు నాలో అంతర్లీనంగా దాగిన నా ఆత్మవిశ్వాసం నవ్వుతూ
వెర్రిదాన్నంటూ...నన్ను కాదని నా పెదవుల్ని తాకి విప్పారుస్తాయి!

Wednesday, April 13, 2016

!!నా తోడు!!

నా ఉనికిని తెలిపే అస్తిత్వపు అద్దం
ఎందుకో తెలియకుండా ముక్కలైపోయె
నలుగురిలో ఒంటరిగా నడుస్తుంటే
చుట్టూ లోకం ఎందుకో వింతగా తోచె
గాజువంటి మనసు ముక్కలై చెల్లాచెదురైతే
గుచ్చుకుంటాయన్న భయంతో తీయలేదు ఎవరూ..
నిజం చెబితే తెగిపోతాయి కొన్ని బంధాలు
అబద్ధమాడితే నాకు నేనే తెలియకుండా విరిగిపోతాను!
ఇది యాధృచికం అనుకో వ్యధతో కూడిన నిజమనుకో
కంటనీరిడిన ప్రతీసారీ నా అనుకున్నవారే కారణమై
ఈ జీవితం అంతులేని వింతకధగా అనిపించె
కోరుకున్నవి అన్నీ చేయి జారిపోయాయి..
జనాన్ని నవ్వించాలని నవ్వుతున్నానే తప్ప
లేకపోతే లోకాన్ని నీట ముంచేంత కన్నీరు నాలో దాగుంది!
ఆశ ఏదైనా ఉందంటే అది కేవలం నా కన్నీటి పైనే
అవి నేను బాధపడితే ఖచ్చితంగా మద్దతునిస్తాయి..

Sunday, April 10, 2016

!!విచిత్రం!!

ఎంత చిత్ర విచిత్రమో కదా...
కళ్ళు ఊటబావి కాకపోయినా
బాధలో నీరు ఉబికి వస్తుంది.
శత్రుత్వం విత్తు కాకపోయినా
పగకి మదిలో బీజం వేస్తుంది.
పెదాలు వస్త్రం కాకపోయినా
మాటమీరితే కుట్లు వేయాల్సింది.
అదృష్టం ఆలి కాకపోయినా
అప్పుడప్పుడూ అలుగుతుంది.
జ్ఞానం లోహం కాకపోయినా
ఆలోచించకపోతే జంగు పడుతుంది.
ఆత్మగౌరవం శరీరం కాకపోయినా
గాయపడి వేదన చెందుతుంది.
మనిషి ఏ ఋతువు కాకపోయినా
అవసరాన్నిబట్టి మారిపోతుంటాడు!!

Tuesday, April 5, 2016

!!సత్యం!!

తియ తీయగా మాట్లాడేవాళ్ళు అందరూ మంచివాళ్ళు
ఉన్నది ఉన్నట్లు ఉప్పగా చెప్పేవారు చెడ్డవారూ కాదు
గమనిస్తే..ఉప్పుతో చేర్చిన పదార్ధాలు నిలువ ఉంటాయి
తీపిపదార్థాల పై క్రిములు వాలి పనికిరాకుండా పోతాయి!

Saturday, April 2, 2016

Friday, March 18, 2016

!!నా వాళ్ళు!!

నా వాళ్ళంటూ నా ముందు నటించి..
ఆ పై నవ్వుకునే నా వాళ్ళు నాకక్కర్లేదు!
 
నన్ను నిజంగా గుర్తించి గౌరవించి..
నాతో ఉండే పరాయి వాళ్ళైనా పర్వాలేదు!

నాకోసం కన్నీరు కార్చే నలుగురే చాలు..
నమ్మించి మోసగించే నలభైమందితో పనిలేదు!

పనికోచ్చే పలుకు ఒక్కటైనా పదివేలు..
పోసుకోలు మాటలతో పళ్ళికిలించి లాభంలేదు!
 

Thursday, March 17, 2016

!!సూక్తులు!!

ఇలాంటి సూక్తులు చెప్పడం సులభమే...
ఆచరించి అవలంభించడం మాత్రం కష్టమే
అందుకునే ఇలా రాసుకుని ప్రాక్టీస్ చేస్తుంది!

Friday, March 4, 2016

!!అద్దం నేను!!

నవ్వుతూ చేతులు నులుముకుంటూ యోచిస్తున్నాను
సాఫీగా సాగలేక సాగుతున్న జీవితం పై అలిగిన నేను!!

నాకు నచ్చిన రీతిలో లోకం మారునని అనుకున్నాను
ఎండనక వాననక నిశ్చలంగా నిలబడి నిరీక్షణలో నేను!!

అంధకారంలో మునిగి మండుటెండలో మాడిపోతున్నాను
అయితేనేం కలలు అపురూపంగానే కంటున్నాను నేను!!

మున్ముందు ఇంకెన్ని భరించాలో అని భీతిల్లుతున్నాను
అలా అనుకుంటూ ప్రశ్నించుకుంటున్నాను నన్ను నేను!! 

అడిగినవారికి చేతనైన సహాయమే చేసాను, చేస్తున్నాను
అవసరానికి వాడుకుని వదిలిన వారందరిలో ఒంటర్ని నేను!!

పలుకరించి పబ్బం గడుపుకున్న వారిచే మనసువిరిగెను
ముక్కలైతేనేం అద్దాన్ని అద్దంలాగే ప్రతిబింబిస్తాను నేను!!

Sunday, February 7, 2016

!!అలిగిన మది!!

దక్కకూడనివి దక్కి, దక్కాలనుకున్నవి దూరమయ్యె
గాజుబొమ్మను అయితి, క్రింద పడగానే ముక్కలైపోయె
ఈ విషయం తెలియగానే కలలసౌధం అసాంతం కూలింది
ఇలాంటప్పుడు బుధ్ధిలేని మనసు ఎందుకని అలిగింది!?

ఫలించలేదు ఆశయం, కానీ జయం జానెడు దూరంలోనే
కొట్టుమిట్టాడుతూ, నన్ను తిట్టుకుంటూ...నా వైపు చూస్తూ
నిస్సహాయతని మరింత నీరుకారుస్తూ నిలబడ్డ నీడనడిగా
చీకటిలో వదలి వెళ్ళడం ఎంత వరకూ నీకు న్యాయమని!?

నాపై నాకున్న నమ్మకం నిట్టనిలువునా క్షణంలో వాలిపోయె
ఇతరులు సాధనలో సాంద్రత నాలో ఎందులో కొరవడెనంటూ
నిద్రాహారాలు మరచిన శ్రమ నీరసంతో శ్యూన్యం వైపు చూసె
జవాబు తెలియని మౌనహృదయం మరెందుకని అలిగింది!?

నేను ఓడిపోలేదు కానీ, వేరెవరో పందెంలో గెలిచి పరిహసించ
ఎంతని నన్ను నేను సమాధాన పరచుకుంటూ...సర్దుకుపోను
సిగ్గుతో తలని వంచుకుని ఎంత దూరం ఇలా ప్రయాణించను
అలిగిన మదిని బ్రతిమిలాడి మార్చి మరలేం ప్రయత్నించను!?

Friday, January 29, 2016

!!ఆశ ఎందుకు?!!

ప్రైవేటు పాఠశాలల్లో విద్య బాగున్నప్పుడు...
సర్కారీ స్కూళ్ళు నడుపుతున్నది ఎందుకు?

ప్రైవేటు ఆసుపత్రిలో ఉత్తమ చికిత్స జరిగితే...
ప్రభుత్వ ఆసుపత్రులంటూ బోర్డులు ఎందుకు?

ప్రైవేటు రంగంలోనే ప్రతీదీ అంత బాగుంటే...
ప్రభుత్వ ఉద్యోగాలే కావాలన్న కోర్కె ఎందుకు?

ప్రైవేటుగా జరిగే పనులే ప్రాముఖ్యం అనిపిస్తే...
ప్రభుత్వం ఎవరో అర్థం కాని సర్కారు ఎందుకు?

కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచిన నాయకుడు
నిస్వార్ధపు దేశసేవ చేస్తారన్న వెర్రి ఆశ ఎందుకు?

Monday, January 18, 2016

!!మొక్కుబడి!!

రోజూ కాకపోయినా
అప్పుడప్పుడూ  గుడికి వెళ్ళి
స్వలాభమే ఆశించి దణ్ణం పెట్టి
కోరికల జాబితాలోని కొన్ని అడిగి
మరికొన్ని తీర్చమంటాను...
మూగ మూర్తి ముందు మోకరిల్లి
నాలో నేనే ఏవేవో అనుకుని మ్రొక్కి
ఆర్జీ పెట్టిన కోర్కెల మంజూరి కై
మొక్కుబడుల లంచం ఎరవేస్తాను...
ఇన్ని వేషాలు వేసినా
రాతి విగ్రహం తొణకదూ బెణకదూ
నిశ్చలంగా నన్నే చూసి నవ్వుతూ
కొన్నిసార్లు క్రోధంగా చూస్తూ
తరచూ నేనడిగే ప్రశ్నలు వింటూ
అవును అనదు కాదని ఖండించదు...
అంత అడగకూడని, కాని కోరికలు
ఏం కోరుకుంటున్నానో నాకు అర్థం కాదు!

Thursday, January 14, 2016

Sunday, January 3, 2016

!!రాజీ బ్రతుకు!!

సమయపు శాఖల నుండి క్షణాల్ని తెంపి వేరుచేసినట్లు
సాంగత్యమే వీడిపోయెనని సంబంధాలు తెంచుకోలేము!

కంటి క్రింద చారికలు, మోము పై ముడతలు చెరిపివేసి
చిరిగిపోయిన చిత్రాన్ని అతికించి రంగులు వేయలేము!

రోజుకి ఇంతంటూ శ్రమించి ప్రోగుచేసి కూడబెట్టిన తేనెను
పోయే ప్రాణానికి ప్రాప్తం లేదని పంచి పండుగ చేయలేము!

సాగరంలో ములుగునని ఒడ్డున తెడ్డువేసి నావ నడిపినట్లు
ఆసరా ఇమ్మని  పిల్లల ఆశయాలకి అడ్డుగా నిలవలేము!

సర్దుకుపోవడం సమయాలోచనని చేతకాని నీతులు చెప్పి
బంధాలతో కట్టివేస్తే, భారమైన బ్రతుక్కి భరోసా ఇవ్వలేము!