Monday, December 25, 2017

!!అది నేరమా!!

జీవించడంలో కొద్దిగా అలసట చెందాను
అందుకే దూరంగా వెళ్ళడానికి ఆలోచిస్తున్నా
అంతేకాని నడక మానేయలేదు సుమా!

తరచూ సంబంధాలు దూరాన్ని పెంచాయి
అలాగని అనుబంధాలు వదులుకోలేదు సుమా!

లౌక్యం తెలీక అప్పుడప్పుడు ఒంటరినయ్యాను
అదే అవకాశమంటూ ఆత్మవిశ్వాన్ని కోల్పోయి 
అదును చూసి నా వ్యక్తిత్వాన్ని వీడలేదు సుమా!

నా అనుకున్న వారందరినీ మనసున తలచి
వీలైనంత మంచిచేసి మన్నన పొందక పోయినా
అలా సహాయపడి చేసిందెవరికీ చెప్పను సుమా! 

Wednesday, December 20, 2017

!!విలువ!!

చేసిన పాపం చెప్పుకుంటే సగం తీరునేమో కానీ చేసిన పనిని గొప్పగా చెప్పుకోవడం, గర్వానికి పోయి ఎదుటివారిని కించపరిస్తే చేసిన పనితోపాటు మన విలువా తరిగిపోతుంది..చదివి ఆలోచించండి!


◆ "నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి.

◆ "నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.

◆ "అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.

◆ "అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయబడుతున్నది.

◆ తులసి ఆకు అన్ని ఔషదగుణాలు ఉండికూడా అణగి తన గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు.

Thursday, December 7, 2017

!!వివాహబంధం!!

ఉదయపు తొలికిరణ తుషారబింధువు నేనైతే   
శీతలరేయి ఘనీభవించి తొణికిసలాడడు తను
   
ఉరుకుల పరుగులా చురుకు పయనం నాది   
నాచుపట్టినా నిలబడగల నిశ్చల నడక తనిది

తన్మయ దరహాసంతో సాగేటి సెలయేరు నేనైతే
నవ్వడానికి రీజన్ వెతికే నిండు సాగరం అతను

సీతాకోకలా రంగుల భావుకత చిందించాలని నేను
ఊసరవెల్లిలో రంగులు ఆరాతీసే మనస్తత్వం తను

వసంత సరాగాలు వినాలన్న కుతూహలం నాది   
అలల అలజడుల విషాదహోరు సంగీతం అతనిది

ప్రత్యేకమైన తేజస్సుతో వెలగాలనే తహతహ నాకు
నిశ్శబ్దం నీడల్లో నిలచిపోవాలనే ప్రాకులాట తనకు

భిన్నధృవాలకి మూడుముళ్ళుపడి ముప్పైరెండేళ్ళు
నిన్న నేడు రేపు విడిపోక సాగాలి ఇలాగే ఇద్దరం! !

Thursday, November 23, 2017

!!మరో ప్రయత్నం!!

ఆలోచిస్తూ నడుస్తున్నానని తెలిసిన నా అడుగులు
పగిలిన పాదాలకు మంచు లేపనం పూస్తున్నాయి!

అలజడ్ళతో చెమటపట్టిన తనువును తల్లడిల్లవద్దని
సేద తీర్చేలా గాలితెమ్మెరలు వీవనలై వీస్తున్నాయి!

ఆవేశంతో హృదయం ఎగసిపడుతుంటే హాయిగొల్పేలా
కోయిలలు కమ్మగకూసి మదికి జోలపాడుతున్నాయి!

ఆశలు నిద్రపోతున్న నాలో కలగా రూపాంతరం చెంది
స్ఫూర్తిని ఇచ్చే ఉదయకిరణాలు మేల్కొల్పుతున్నాయి!

అణచి వేయబడిన కోరికలు బద్దకం వీడి రెక్కలు విప్పి
రివ్వుమంటూ మరో ప్రయత్నం వైపు సాగుతున్నాయి!

Tuesday, November 14, 2017

!!సరిపోయింది!!

నా మానాన్న నన్ను వదిలేయి
సజీవంగా ఉన్నానుగా సరిపోదా!

గాలిని వాటా ఇవ్వమని అడిగాను
కనబడకుండా శ్వాసని ఇచ్చిందిగా

ఒంటరితనాన్ని తోడుకోరుకున్నాను
మది జ్ఞాపకాలే ఊసులు చెప్పెనుగా

జీవితం అడగమని బలవంతపెట్టినా 
అడగడానికి ఆశలంటూ మిగల్లేదుగా!

Sunday, November 5, 2017

!!మాట్లాడ్డానికో మనిషి!!

ఆస్తీ అంతస్తుల్ని పెంచుకునే యావలో 
బంధానుబంధాలకు ఆనకట్టలు కడుతుంటే
వాస్తవాన్ని జీర్ణించుకోలేక వ్యాకులచిత్తులై
జీవన సంధ్యాసమయంలో అనాధలై మిగిలి
ఆర్ధిక ఆహార ఆరోగ్య విషయంలో కొదవలేక
మాట్లాడుకోడానికి మనుషుల్లేక మదనపడే
నిర్భాగ్య నిస్సహాయ జీవులున్నారు ఇక్కడ
పనిలేకపోతే పక్కవాళ్ళని పలుకరించనప్పుడు          
పనిగట్టుకుని వృద్ధులమాట వినరు గ్రహించుకో!

ఎవరి జీవితానికి వారే బంధీలై స్వార్థం పెరిగె
ఒంటరితనం తప్పదని తెలిసి నీవు మసలుకో
మనిషి బెంగని సొమ్ముచేసుకునే కాలమాయె
పనిమనిషి వాచ్‌మెన్‌ వంటవాడితో పాటుగా.. 
మాట్లాడ్డానికి మనిషి మనీకి దొరికేను చూసుకో  
మమకారాలు బంధబాంధవ్యాలు గాలిబుడగలు
బెంగపోగొట్టే బంధాన్ని బాడుగకైనా అమర్చుకో   
చెంతన ఉండి చింత తీర్చి నగదు ఇస్తే నటించే
నకిలీమనిషైనా మాట్లాడ్డానికి అవసరమని తెలిసుకో!    

Thursday, October 19, 2017

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి వచ్చిందని దివిటీలు కొట్టి
టపాసుల ధ్వనులతో అలజడి రేపక
నవతను వెలుగుతున్న దీపకాంతిలో
చైతన్యపు తారాజువ్వలు రువ్వమని 
అమావాస్య చీకట్లను వద్దని తరిమేసి
మనిషి మదిలో వెలుగును నింపుతూ
అజ్ఞానపు తిమిరాలను పారద్రోలే తేజాలై
విజ్ఞానపు కిరణాలను విరాజిల్లేలా చేసి
రేపటి లోకంలో దూసుకెళ్ళే రాకెట్లకు
చీకటిలేని అమావాస్యల తీపిని పంచి
పండుగ పరిమళాన్ని రోజూ అందిద్దాం!  

Thursday, October 5, 2017

!!సహనం!!

నీలో నువ్వు దాచుకోలేని నిజాలు
ఇతరులకు చెప్పుకున్నావంటే 
వారు తమలో ఎలా దాచుకోగలరో
తెలుసుకుని తెలివిగా మసలుకో
మనతో అవసరం లేకుండా
మనల్ని ఎవ్వరూ ఇష్టపడరు
నీలోన నీతో తర్కించుకో..
స్వార్థం మనిషి జన్మహక్కు అనుకో 
మన శక్తి కన్నా మన సహనమే
మంచి ఫలితాన్ని ఇస్తుంది చూసుకో!

ఈ వాక్యాలు నా కూతురు రమ్యశ్రీ పై చదువులకు లండన్ వెళ్ళినప్పుడు చెప్పాను..ఇవి తనకు ఎంత వరకూ వర్తించి ఉపయోగ పడ్డాయో తెలియదు కానీ నాకు కాలం మరియు అనుభవం అన్నీ నిజమని నిరూపించాయి "సహనం సత్ఫలితాలను ఇస్తుంది" అనే చివరి వాక్యాలు తప్ప...అప్పుడు తనని చూసుకో అన్నాను నేను ఇప్పటికీ వేచి చూస్తూనే ఉన్నాను!  

Friday, September 29, 2017

!!జై మాతాజీ!!

బతుకమ్మ రావమ్మ బ్రతుకు చల్లగా చూడమని
రకరకాల పూలతో నవరాత్రులు పూజించేటోళ్ళు
నవమాసాలు మోసి బ్రతుకునిచ్చిన అమ్మలను
అత్తమ్మలను రమ్మని పిలిచే వారు కరువాయె  
వృధ్ధాశ్రమాల్లో వదిలేసి పలుకరించైనా రారాయె! 

రోజుకో రకపు పిండివంటతో దేవికి నైవేద్యం పెట్టి 
పనికి జీతాలు పండుగ బోనస్లు కావాలనేటోళ్ళు
రక్తాన్ని పాలుగా చేసి పొత్తిళ్ళ పొదిగి దాచుకుని   
పెంచి పెద్దచేసినోళ్ళ కడుపుకింత తిండి పెట్టరాయె
పైగా ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదని నిందలాయె!

నాలుగు దిక్కులా జైజై మాతాజీ అంటూ కేరింతలు 
దిక్కులేని ఒంటరి మాతాజీల ఎన్నో కన్నీటిగాధలు! 

Wednesday, September 20, 2017

!!గారడీ ఆశలు!!


ఇసుక రేణువులు నీటిలోన మెరిసి 
దూరపు కొండలు నున్నగా కనబడి
కనులకి ముసుగేసి గారడీ చేసాయి!

గమ్యాలు గతులు తప్పి గాభరాపెట్టి
అస్థిత్వాన్ని చింపి చెల్లాచెదురు చేసి
జీవితమంటే ఇదేనంటూ నిలదీసాయి!

బంజరు కలలబీటల్ని కన్నీరుతడిపి  
మనోవాంఛలు మూకుమ్మడై కలబడి
కస్తూరి సుగంధాన్ని కోరుతున్నాయి!

అనుబంధాలు అవసరానికి అల్లుకుని
బంగారులేడిలా మభ్యపెట్టి మసిపూసి
బింబానికి ప్రతిబింబాన్ని జతచేసాయి!  

ఆశచావని విరిగిన మనసు పురివిప్పి
ఒంటరి సామ్రాజ్యపు రాజు రాణి తానని
బూజుల విసనకర్ర విసురుతున్నాయి! 

Monday, September 11, 2017

!!భయానికే భయం!!

భయానికి నా నవ్వంటే ఎంతో భయం
పెదవులపై ఉన్న నవ్వూ దర్పం చూసి 
నా మనసులో దాగి ఉన్న ఆవేదనను  
కష్టనష్టాల్లో కూడా పలుకరించి పోదు!

వ్యధలు ఎన్ని ఉన్నా ఎదలోనే దాచేసి 
పైకి గంభీరంగా నవ్వే నేనంటే కన్నీటికి
తెలియని అసూయా అసురక్షిత భావం 
అందుకే ఏడుపు రమ్మన్నా దరిరాదు!

Monday, August 28, 2017

!!గడిచిన కాలం!!

క్షణాలన్నీ బాటసారులై సాగిపోయాయి.. 
జ్ఞాపకాలు మాత్రం రహదారిలా మిగిలాయి
సమయం ఉన్నప్పుడు ఆస్వాధించలేదు
జీవితాన్ని నమ్మి సాధించింది ఏంలేదు 
గూడల్లుకునే ధ్యాసలో పూర్తిగా మునిగితినేమో
ఎగరడానికి రెక్కలున్న విషయమే మరిచిపోయా
సంతోషాన్ని జీవితంతో ఖరీదుకట్టి కొనొచ్చనుకున్నా 
ఆనందం అదృష్టవంతులకే దక్కుతుంది కానీ 
అమ్ముడయ్యేది కాదనీ ఆలస్యంగా తెలుసుకున్నా!

Wednesday, August 16, 2017

!!కాలమహిమ!!

సింహము గాయపడిందని గర్జించడం మాని గాభరాపడితే 
ఎలుక కూడా దానిపై ఎగిరెగిపడి గెంతుతూ ఆటపట్టించేను..
కుక్కలేమో దాని పనైయ్యిందని మొరిగేను!
ఎవరికి తెలిసినా తెలియక పోయినా
ఇదంతా కాలమహిమని సింహానికి తెలుసును
కలసిరాని కాలంతో చేతులుకలిపి సన్నిహితులే శత్రువులైనా
ఉచ్చులెన్నో వేసి చిక్కుల్లోపడేసి గాయపరచినా
సింహము చిన్నబోయేనా...
ఆకలి వేసిందని గడ్డి తినునా!?
అప్రమత్తంతో ఆలోచించి పరిస్థితుల్ని పల్టీ కొట్టించి..
మరల సింహగర్జనతో చిందులేయకపోవునా!!

Wednesday, August 9, 2017

!!చివరికి!!

ఎవరి జీవితపు ఉయ్యాలని వారే ఎక్కి ఊగాలి
ఎవరో వచ్చి ఎక్కించి ఊపుతారు అనుకోవడం
అవివేకమే కాదు అనాలోచితం అనుకుంటాను!

శూన్యంగా ఉన్న ఆకాశాన్ని చూసి ఆలోచించు
వీలైతే అంత ఎత్తుకి ఎగిరే ప్రయత్నం కావించు 
ఎత్తుని చూసి భయపడ్డం మూర్ఖత్వం అంటాను!  

సుఖదుఃఖాలు ఆటుపోట్లలా వచ్చి పోతుంటాయి 
క్షణకాలం మేఘంలా వచ్చి ఉరిమి భయపెట్టినా
తుదకు తడిసి తడిమే జ్ఞాపకాలుగా మిగులును!

Sunday, July 30, 2017

!!ఆలోచించాలి!!

గోడలకు పగుళ్ళు పడితే గోడ కూలిపోతుంది
బంధాలు బీటలైతే అదే అడ్డుగోడ అవుతుంది
వందసార్లు మంచి చేసి నీవొక్కసారి తప్పుచేస్తే
వందసార్లు నీవు చేసిన మంచిని మరచిపోయి
నీవొక్కసారి చేసిన తప్పునే ఎత్తి చూపుతుంది
లేనిదేమో కావాలని ఉన్నది వద్దు అనిపిస్తుంది
మొహమాటానికి పోయి మన సంతోషాలని వీడి
ఎదుటివారికి దానంచేస్తే విషాదం మిగులుతుంది
ప్రయత్నం పట్టు విడిస్తే అది నిన్ను వదిలేస్తుంది 
మనల్ని మాయ చేసే మనసుని అదుపు చేస్తే
జీవితం పై గెలుపు సాధించాము అనిపిస్తుంది!

Sunday, July 23, 2017

!!పట్టుదల!!

నాలోని ఆత్మబలం నిదురలేచిందేమో
నా అహంభావం కనురెప్పలు కదుపుతూ 
అహంకారపు గుండె తలుపు తడుతూ
సమస్త శక్తులను ధీమాతో కూడదీసుకుని 
శ్రమకు ఆతిధ్యమిచ్చి ఆలింగనం చేసుకుని
నమ్మకంగా నాతో నేను అనుకున్నాను..
అందరిలా బ్రతికితే ఔనత్యం ఏముంది
నలుగురికీ ఆదర్శమైతే ఔదార్యముంది
అందుకే దృఢసంకల్పంతో నిర్ధారించుకున్నాను 
వైఫల్యాలు ఎన్ని ఎదురైనా విధి ఎంత వక్రించినా 
ఊపిరి ఉన్నంత వరకూ లక్ష్యసాధనకు కృషిచేస్తాను!

Tuesday, July 4, 2017

!!గ్రేస్ఫుల్ ఏజింగ్!!

50 సంవత్సరాలు దాటినవారు చదివి ఆలోచించి ఆచరణ యోగ్యం అనుకుంటే రాబోయే జీవితానికి ఇది పనికివస్తుంది..పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అప్పట్లో రాసారు ఇప్పుడు సుఖమయమైన వృధ్ధాప్యం కోసం పదిహేను పంక్తులు..
1. మీ సొంతఊరిలో, సొంతగడ్డ పై నివసించండి...స్వతంత్రంగా జీవించడంలోగల ఆనందాన్ని పొందండి!
2. మీ బ్యాంకు బాలెన్స్ & స్థిరాస్థులు మీ పేరు మీదే ఉంచుకోండి.. అతిప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి!
3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు. ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు!
4. మీ శ్రేయస్సుకోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి!
5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చేదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి!
6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.మీరు మీ తరహాలో జీవించండి!
7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలనో లేదా వయసు కారణంగా ఎదుటివారు గౌరవం ఇవ్వాలనో ఆశించకండి!
8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ సొంతఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి!
9. ప్రార్ధించండి కాని అది భిక్షమెత్తుకుంటున్నట్టు కాదు, చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు.. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి!
10. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి చక్కని పౌష్టికాహారం తీసుకోండి.. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి. పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు సహజమే!
11. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి!
12. ప్రతి సంవత్సరం వీలుంటే ఇతరులతో కలిసి చిన్నటూరుకు వెళ్ళిరండి. దీనివలన జీవితంపట్ల మీ దృష్టికోణం మారుతుంది!
13. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోండి. ఒత్తిడిలేని జీవితాన్ని గడపండి!
14. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి!
15. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడమని గ్రహించండి!

Monday, June 26, 2017

అరవైలో ఇరవై


అరవైలో ఇరవై కోసం చేసే కసరత్తులు కావివి.. 
అనుభవాలతో ఆరితేరిన సారాంశ గుణపాఠాలు 
పాత తరానికేం తెలియదని గేలి చేసేరు కుర్రకారు 
పిల్లకాకులకేం తెలుసునని ఉండేలు దెబ్బలు.. 
తెలివితేటలతో ఆలోచనల్లో అంబరాన్ని తాకుతారు 
అరిటాకులతో పోల్చినా అన్నింటా మిన్న స్త్రీలు.. 
తెర ముందు తెర వెనుక అవసరం నేడు నటనలు
నేటి తరానికి ఆవేశం ఎక్కువ ఆలోచనలు తక్కువ 
కష్టపడకుండా కావాలనుకుంటారు ధనవంతులు.. 
ఉన్నంతకాలం హాయిగా నవ్వుతూ నవ్వించక 
కడకు ఒంటరేనని తెలిసీ ఎందుకీ తాపత్రయాలు.. 
చీకటివెలుగుల్లా వచ్చిపోతాయి సమస్యలు సంతోషాలు 
ఏదేమైనా ఎంజాయ్ చేసేద్దాం రండి మన జీవితాలు!!

Wednesday, June 21, 2017

!! డౌట్ !!

నాదొక డౌట్...శంకర్ బ్రాండ్ పొగాకు
గణేష్ బ్రాండ్ బీడీలు, లక్ష్మీ బ్రాండ్ టపాసులు
కృష్ణ బార్ & రెస్టారెంట్, జైమాతా మటన్ షాప్ చూసా
కానీ ఇంత వరకూ ఎప్పుడూ ఎక్కడా నేను
అల్లా బ్రాండ్ గుట్కా, ఖుదా బ్రాండ్ బీడీ,
జీజస్ బ్రాండ్ చుట్టలు, క్రీస్తు చికెన్ షాప్ అంటూ
అమ్మే దుకాణాలు ఎక్కడా చూడలేదు!!
ముస్లింలకీ క్రైస్తవులకీ ఈ అలవాట్లు లేవా?
లేక వారు ఈ దురలవాట్లకు బానిసలు కారా?
అంటే...అన్ని మతాల్లోనూ బానిసలు ఉన్నారు
వారిలో ఉన్న ధర్మ సన్మానం, భగవంతుని పై భక్తి
హిందువుల్లో కొరవడిందనే అనిపిస్తుంది...కాదంటారా!??

(ఇది కేవలం నా ధర్మ సందేహమే తప్ప ఎవరినీ ఉధ్ధేశించి కాదని మనవి చేసుకుంటున్నాను-పద్మారాణి)

Friday, June 16, 2017

!!బ్రతుకు కష్టం!!

విహంగాన్నై స్వేచ్ఛగా విహరించాలని
గ్రహాల మధ్య విలాసంగా పయనించాలని
కోట్ల క్రోసుల దూరదృశ్యాలను వీక్షించాలని
హిమాలయాల్లో ఐహిక వాంఛలు వీడాలని
భూగర్భంలో చొరబడి చిందులేయాలని
స్వల్ప రేణువుగా మారి ఎగిరిపోవాలని
సాగరంలో చేపలా కదలాడాలని
మండుటాగ్నిలో కాలక సేదతీరాలని
కోరుకోవడం ఒక ఎత్తు అయితే....
మనిషై పుట్టినందుకు మనిషిగా బ్రతకడం
మరో ఎత్తు...అవునంటారా కాదంటారా!? 

Friday, June 9, 2017

!!లోకం తీరు!!

నాలా ఉండలేక నా వెనుక
గుసగుసలాడేరు కుచితస్వభావులు..
నాకు దక్కినవి వారికి దక్కవని 
ఈర్ష్యచెందేరు అసూయపరులు..
నాతో పోల్చుకుని ప్రయత్నించకనే
లోలోన కుళ్ళేరు అసమర్ధులు..
దేన్నైనా చిరునవ్వుతో స్వీకరిస్తారు
లోకం అర్థమైన జ్ఞానులు!

Wednesday, June 7, 2017

!!మనసా వస్తావా!!

మనసా దూరతీరాలకు వెళదాం వస్తావా 
వేదనలతో హృదయం నిండె ఊరడిస్తావా
వ్యధగాయాలు ఆశల్లేని లోకం చూపవా 
కులాసాల కొత్త కుటీరం ఏదైనా వెతకవా

ఉద్యానవనమేల అందులో మనసు కాల
నాకు అవసరం లేదు విశాలమైన లోగిలి
నావనుకున్న నాలుగు గోడలుంటే చాలు
గాలి వచ్చిపోయేలా గుండె తలుపు మేలు

బాధలే జ్ఞాపకం రానట్టి లేపనం పూయవా
ఓదార్పు ముసుగులో కన్నీరు దాచేయవా
నవ్వుతో నటించే నేర్పు నాకు నేర్పించవా 
ఓ నా మనసా ఎగిరిపోదాం నాతో వస్తావా! 

Saturday, May 20, 2017

!!మధుర జ్ఞాపకాలు!!

చిన్నప్పుడు చిట్టి అడుగులు వేస్తూ
చిరునవ్వుతో నన్ను ప్రశ్నిస్తూ
మురిపించి మరిపించిన నా చిన్నారి
చీర కొంగట్టుకు తిరిగి చిత్రంగా చీరకట్టి
నా ఒడిలో ఎదిగి వేరొకరి మదిలో ఒదిగి
విచిత్రంగా అన్నీ జరిగె
ఆలోచిస్తే అనిపిస్తుంది...
కాలం త్వరగా పరుగులెట్టెనని!
ఆ చిన్నినాటి చేష్టలు
అప్పటి ఆ మాటలు
ఎప్పటికీ నాకు మధుర జ్ఞాపకాలేనని!!

Tuesday, May 16, 2017

!!ప్రాకులాట!!

చెప్పేవారు కొందరు మౌనంగా మరికొందరు
నీడగా కొందరు నిట్టూర్పులతో ఇంకొందరు
ఎవరుండి చేసేది ఏముంది ఒరిగేదేముంది!

కొందరు తామేడుస్తూ ఇతరులని నవ్విస్తారు 
మరికొందరు నవ్వులు రువ్వుతూ ఏడుస్తారు
ఇలా నవ్వినా ఏడ్చినా కాలం ఆగనంటుంది!

కలలో వచ్చి జోలపాట పాడేవారు మనవారు
గాఢనిద్రలోంచి మేల్కొల్పుతారు పరాయివారు 
దరిచేర్చుకుని పొమ్మన్నా తేడా తెలియకుంది!

కొందరు మనసులో దూరి మనకి దగ్గరౌతారు
మరికొందరు వాస్తవాలకి వికృతిచేష్టలు అద్దేరు
అర్థమై అర్థంకాని వారు ఉండి లాభమేముంది!

ఇలా కొందరు అలా కొందరు ఎందుకో తెలీదు
ఆలోచించి ఆవేశపడి కూడా చేసేది ఏమీలేదు 
అందుకే పట్టింపు ప్రాకులాటలతో దిగులొద్దనేది!

Friday, May 5, 2017

!!తెలిసేది ఎలా!!

ఎలా తెలుసుకోను మదిలోని కోరికను
అవిటి ఆశ అవశేషాలే ఊతకర్రగా మారి 
కనబడే ముళ్ళమార్గాన్నే దాటేయమంటే
శాంతి సౌఖ్యమే ముందుంది పదమంటే!

ఒంటరైన ప్రయాస మొండికేసి కదలనని
దూరంగా మసగబారిన గమ్యాన్ని కసిరి  
కంపించే మరణాన్నే కౌగిలించుకోమనంటే
బండబారిన మనసుని ఎలా మభ్యపెట్టను!

గుండెకు చేరువగా మందిరం కనబడినా
ముక్తి ఉండలేనని వెళ్ళె బంధనాల దారి
తపనపడే తనువు వ్యధని తగ్గించలేనంటే
చింతలకి చికిత్స లేదని ఎలా తెలుపను!

కోమల కలుషిత హృదయాన్ని ఏమనను 
స్వార్థం ఎక్కుపెట్టి చూసె వయసునే గురి
చివరికి బాధలే బరిలోకి దిగి యుద్ధమంటే
గెలుపెవరిదనను జీవితమే అంతమౌతుంటే! 

Wednesday, April 19, 2017

!!తేనె పలుకులతో!!

తేనె ఎన్నేళ్ళ తరువాత సేవించినా
తీయదనం చెక్కుచెదరదు..
తేనెలూరే పలుకులతో ఎన్నేళ్ళైనా 
ఎదుటివారి ఎదలో కొలువుతీరొచ్చు! 

ఆనందపరిచే అవకాశం వస్తే వదలకు
పిసినారితనం చూపి ముఖం చాటేయకు
ఎదుటువారిని నవ్వించే నేర్పు.. 
అదృష్టం, అవకాశం అందరికీ దొరకవు!

Wednesday, March 29, 2017

!!హేవిళంబి స్వాగతం!!

ఏ ఏడాతికాయాడాదే ఆహా హో అనుకుంటూ 
అంతా మంచి జరుగునని గెంతులేసుకుంటూ
గడచిన కాలం తిరిగిరాదని వచ్చేది గొప్పదని 
జీవితమంటే షడ్రుచుల సమ్మేళనమని సర్దుకుని
సంకలెగరేసి సంబరపడినా కాదని చతికిలబడినా
పంచాంగ పారాయణం చేసి పళ్ళు ఇకిలించినా
జరిగేది జరుగకా మానదు బ్రతుకు మారిపోదు
కోయిల కూసిందని కాకి అరవడం మానేయదు!
బ్రతకడానికి తినే తిండిలో రుచులు తగ్గినా తిని
కారాన్ని మమకారం నుంచి తీసి తీపిని పెంచు
చేదు చేబదులిచ్చి ఉప్పును నిప్పుగా మార్చకు
మాటలకు పులుపు చేర్చి వగరుతో పొగరుబోకు
ప్రతి మనిషీ....నిర్మల నిశ్చల సమున్నతమై
సాటి వారిపై సానుభూతి ఉంచి మసలితే చాలు
ప్రకృతి ప్రతిరోజూ పులకరించి వసంతాన్ని పంచు
అది చూసి ఇంటింటా పండుగ వద్దన్నా నర్తించు!
హేవిళంబి తెలుగు సంవత్సరమా నీకు స్వాగతం..

Friday, March 24, 2017

!!వేర్పాటు పవనాలు!!

ద్వేషం చేసిన దుష్ఫలమో లేక మనిషి గుణమో 
జంతువులు రెండుగా విభజించబడ్దాయి..
ఆవులు హిందువు మేకలు ముస్లిం అయ్యాయి
మధుషాలలో మాత్రం మనిషి అవతారం అగుపడ
చెట్లూ పుట్టలు ఆకులూ అలములు కలతచెందాయి!
పక్షులు పావురాలు కూడా హిందు ముస్లింలైతే..
ఎలాగని ప్రశ్నిస్తూ ఎండిన గింజలు ఏడ్చాయి
కొబ్బరికాయ హిందూ ఖర్జూరం ముస్లిమైనట్లే తెలీదని
ఆకలిప్రేగు అసలు విభజన ఏమిటి? ఎందుకన్నాయి!
వేర్పాటు వాదులకు విడిపోవడం అచ్చొచ్చెనేమో..
కానీ..నా వాదనలు మాత్రం అత్యోత్సాహ పడనన్నాయి!

Wednesday, March 22, 2017

!!ప్రయత్నం!!

నీటి పైపైన ఈదితే..
లోనున్న ముత్యాలు దక్కవు!
అభ్యాసన చేయకపోతే..
అనుభవం రమ్మంటే రాదు! 
ముఖానికి రంగులద్ది..
మనసులో మర్మం మార్చలేవు!
పూలను తూచి..
రాళ్ళ బరువెంతో చెప్పలేవు
చేయలేనని నిరుత్సాహపడితే..
అనుకున్నది ఏదీ సాధించలేవు!!

Tuesday, March 14, 2017

!!వాటి నైజం!!

నాటనివాడు చెట్టు నరికినా
వాలిపోయే వరకు నీడనిస్తుంది
అది ఎదిగిన చెట్టు నైజం...

నీరుని వృధాగా పారబోసినా
మురికి ఉంటే కడిగేస్తుంది
అది మంచినీళ్ళ తత్వం...

తొక్కి మొక్కునని గుడిమెట్లెరిగినా
దేవుని సన్నిధికి తీసుకెళుతుంది
గుడిమెట్లకున్న ఉదాత్త గుణం... 

Wednesday, March 8, 2017

!!ఓ మహిళా!!

బలమైన స్త్రీ ఎంత లోతుగా ఆలోచిస్తుందో
అంతకు రెట్టింపు ప్రేమను పంచుతుంది!!

ఎంత సున్నిత మృదువైన మనసు కలదో 
అంతకు మించిన శక్తిసామర్ధ్యాలు కలది!!

ఎంత మనస్ఫూర్తిగా నవ్వులు చిందిస్తుందో 
అంతే వ్యధను మదిలో దాచుకుంటుంది!!

ఎంత ఆచరణాత్మకంగా పనులు చేయగలదో 
అంతగానే అధ్యాత్మికపై ధ్యాస పెడుతుంది!!

బలమైన మహిళ తనకు తానే సారాంశము
ప్రపంచము పొందిన వరానికి నిర్వచనము!!

Friday, March 3, 2017

!!ఎంత బాగుండు!!

ఋతువు మారెనని గాలితెమ్మెర గాబరాపడె
పూల పుప్పడినేమో తుమ్మెద జుర్రున దోచె
జీవిత స్థితిగతులు మార గుండె గుబులాయె
ఈ వంకన నేను మారితే మరింత బాగుండునే!

వీధీ వాకిలి పాతదైనా కొత్తవెలుగు దానిపైపడె
చిలిపితనమేమో కుప్పిగెంతులు వేస్తూ ఎగిరె  
మదిరూపమే మారి అదృష్టం తలక్రిందులాయె
ఇలా సాకులతో నా స్థితి మారితే బాగుండునే!

ఆశయాలు ఆకారాన్ని మార్చేసి కుంటుపడె 
నవ్వడం మరచిన ముఖం కన్నీటితో తడిచె 
వలస పక్షులు వచ్చినట్లే వచ్చి పైకెగిరిపోయె
ఇదే అదునుగా నేను ఎగిరిపోతే బాగుండునే!

Thursday, February 23, 2017

!!ఎదుగుదల!!

నివాసం ఉండేది చిన్న ఇంట్లోనే అయినా
మనసులు అందరివీ పెద్దవిగా ఉండేవి..
నేలపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నా
ప్రక్కనున్నారు మనవాళ్ళన్న భావముండేది
ఇప్పుడు సోఫాలు డబుల్ బెడ్ మంచాలు 
మనుసుల్లో మాత్రం పెరిగాయి దూరాలు..
ఆరుబయట వేసుకునే మడతమంచాల్లేవు
చెప్పుకోవడానికి ఊసులు అంతకన్నా లేవు!

ప్రాంగణంలో వృక్షాలు వస్తూపోతుంటే పలకరించేవి
అపార్ట్మెంట్లుగా అవతరించి హడల్గొడుతున్నాయి..
తలుపులు తీసుండి బంధుమిత్రులను ఆహ్వానించేవి
సైకిల్ ఒక్కటున్నా అందరితో పరిచయాలు సాగేవి
డబ్బులు కొన్ని ఉన్నా పెదవులపై నవ్వు ఉండేది
నేడు అన్నింటినీ సాధించాము కామోసు..
అందుకే అవసరమైనవి అందకుండాపోయాయి 
జీవిత పరుగులో ఆనంద వర్ణాలు వెలసిపోయాయి!

ఒకప్పుడు ఉదయాన్నే నవ్వుతూ లేచేవాళ్ళం 
మరిప్పుడు నవ్వకుండా ముగిసే సంధ్యవేళలెన్నో
ఎంతో ఉన్నతి సాధించాం సంబంధాలతో నటిస్తూ..
మనల్ని మనం కోల్పోయాం మనవాళ్ళని వెతుకుతూ!

Sunday, February 12, 2017

!!ప్రోద్భలం!!

ఆత్మఘోష రెపరెపలాడుతూ పైకెగురుతుంటే 
శాంతి సంకెళ్ళ కోసం వెతికే మనసు అలిసిపోతే
ఊరడించడానికైనా ఒక్కసారి ఆ ఘోష వినరాదా
ఓదార్పు కోసమైనా అశాంతిలో శాంతి చూపరాదా
సలహా సంప్రదింపులతో ఓటమికి గెలుపు నొసగి 
ఆత్మస్థైర్యానికి సరిహద్దులేదని చాటి చెప్పరాదా!

అవకాశాలతో అల్లుకున్న గొంగళిపురుగులుంటే
కాలానికి అణుకువను ఆయుధంగా అందించి 
రంగురంగుల సీతాకోకచిలుకలుగా మార్చేయరాదా
ఒద్దికలేని మిడిసిపాడు జయంకి ప్రతిబంధకం కదా
నిరంతర కృషికి ఓర్పుని శక్తి ఔషధంగా నూరిపోసి
బ్రతుకు బంధీ కాకుండా ప్రోద్భలాన్ని చేకూర్చరాదా!

Wednesday, February 8, 2017

!!ప్రాయం!!

పెరుగుతున్న ప్రాయం నాతో అంది 
ఇకనైనా వీడు ఈ అమాయకత్వానని
గంభీరత్వంతో వ్యవహరించమని..
తరుగుతున్న తుంటరితనం అంది
ఇంకొన్నాళ్ళు తనతో జల్సా చేయమని
ఆపై మృత్యువే వద్దన్నా వదలదని..    
గడ్డిపువ్వైనా గులాబీ అయినా 
విప్పారి వికసించినాక వడలక తప్పదని!

Saturday, February 4, 2017

THIS SOCIETY

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు .
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది .
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు .
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు .
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది .
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు .
ఎందుకలా జరిగింది ?
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.
THIS IS EXACTLY WHAT IS HAPPENING NOW IN THIS SOCIETY!!

Tuesday, January 31, 2017

!!ఫోటోపిచ్చి!!

ఫోటోలంటే పిచ్చ ప్రేమ నాకు 
  
ఎందుకంటే...మనిషి మారినా

ఎప్పటికీ అవి మారక మురిపిస్తాయి

నీలోని లోపాలను నీకు చూపిస్తాయి

ఒంటరై ఏడిస్తే ఓదార్పై నవ్విస్తాయి

ఎన్నటీకీ వయసు పైబడనంటాయి

విడిపోయిన బంధాలని బలపరచి 

మరచిన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి! 

Monday, January 30, 2017

!!పరిశోధన!!

నోటిమాట వినే వారే అందరూ
మనసు పడే వేదన వినరెవ్వరూ
శబ్దాలతో మారుమ్రోగు సంతలో..
నిశ్శబ్దాన్ని గుర్తించేవారు ఉండరు
అక్కరకురాని ఎన్నో ఆలోచనలు
ప్రేమ సంపాదన బంధాలు అంటూ
అనవసర చర్చలు సమావేశాలు..
ఆర్జించింది ఎంతో కోల్పోయిందేమిటో
       తెలుసుకునే ప్రక్రియలో ఫలితం శూన్యం       
శతాబ్దాలుగా దొర్లుతున్న పరిశోధనలో   
సాగుతూనే ఉంది శాంతి కొరకు శోధన!!

Wednesday, January 18, 2017

!!హైటెక్ లైఫ్స్!!

సుఖఃసాధనాల నడుమ యాంత్రికజీవులు
అనుభూతుల్ని దాచే దర్పాలు ఢాంబికాలు
మసకల ముసుగులో అనిశ్చల గమ్యాలు
అలరించే రంగుల్లో రాగంలేని అనురాగాలు
మమతలకు మరకలు అంటి అరమరికలు
ఆదరణ ఆప్యాయతలు జ్ఞాపకపు చిహ్నాలు
ఆనందాల్ని సుడిగుండంలోకి నెట్టిన వ్యధలు
నిరాశ నిట్టూర్పుల్తో బంధించబడ్డ బ్రతుకులు
సంతోషాలని సంతలో వెతుక్కునే ప్రాణులు
నేటి కృత్రిమ హైటెక్ ఆశ్చర్యకర జీవితాలు!!

Wednesday, January 11, 2017

!!పయనం!!

నా పాదాలకున్న పగుళ్ళు
నన్ను పదే పదే వారిస్తున్నా
ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నా
నా తనువును సేదతీర్చాలని
గాలితెమ్మెర పవనాలు వీస్తున్నా
కృషిచేయాలని కంకణం కట్టుకున్నా
నా మనసుకి హాయిని ఇవ్వాలని
కమ్మనైన రాగం వింటున్నా...
ఉత్సాహంగా గమ్యంవైపు సాగిపోతున్నా!

Wednesday, January 4, 2017

!!మృత్యువు!!

నేను నమ్మిన వారే నన్ను మోసగిస్తే

గాయమైన గుండెకే గాయమౌతుంటే

నిజాయితీ లేని వారు సైతం నీతి చెప్ప

కొరగాని వారు కూడా కోపంతో చూడగా

కుళ్ళు కుతంత్రాలు కబళించి కన్నుగీట 

ఇష్టంలేని క్రియలే కౌగిలించి కాటువేయ

భయపడతాయి అనుకున్నవి బంధించ 

మృత్యువుని మాత్రం మోహించి రమ్మని

బాహటంగా పిలువ భయమేలనో దానికి!